చిత్తూరు జిల్లాలో అమరరాజా ఫ్యాక్టరీ కాలుష్యమయమని అందుకే తరలించమని కోరుతున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా కోర్టుకు అదే నివేదిక ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో పరిశ్రమల కాలుష్యంపై చర్చ ప్రారంభమైంది. చిత్తూరులోని అమరరాజా ప్లాంట్‌పై ఇంత వరకూ ఎప్పుడూ తీవ్రమైన ఆరోపణలు రాలేదు. ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ సంస్థ కాలుష్యం వెదజల్లుతోందని చెప్పలేదు. దీంతో ప్రభుత్వం తీరుపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. అందుకే ఇతర కాలుష్య కారక పరిశ్రమలపైనా చర్చ ప్రారంభమైంది.
పులివెందుల ప్రజల గుండెల మీద కుంపటి యురేనియం ప్లాంట్..!
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో ఉన్న యూరేనియం ప్లాంట్‌పై అందరిలోనూ చర్చ జరుగుతోంది. అ ప్లాంట్ వల్ల ఎంత దారుణమైన నష్టం జరుగుతుందో.. సాక్ష్యలతో సహా వెలుగులోకి వస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు సరి కదా.. విస్తరణకు సహకరిస్తోంది. సీఎం జగన్‌కు ఓట్లేస్తున్న ప్రజల ప్రాణాలు.. ఆస్తులను పనికి రాకుండా చేస్తున్న యూరేనియం ప్లాంట్‌పై ప్రభుత్వం మెతక వైఖరి అవలంభిస్తూ… కొన్ని వేల కుటుంబాలకు ఆసరాగా ఉంటున్న అమరరాజా సంస్థపై దాడులకు తెగబడటం ఏమిటన్న చర్చ ప్రారంభమైంది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తుమ్మలపల్లిలోని యూరేనియం ప్లాంట్ ఉంది. యూరేనియం ఎంత ప్రాధాన్యమైనదో..ఎంత ప్రమాదకమైనదో కూడా. వైఎస్ హయాంలో హయాంలో.. ఏ రాష్ట్రం కూడా.. యూరేనియం ప్లాంట్ ను తమ రాష్ట్రంలో పెట్టడానికి అంగీకరించలేదు. ఎక్కడ ప్రజాభిప్రాయసేకరణ జరిగినా.. వ్యతిరేకత వచ్చింది. దాంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవ తీసుకుని 2008లో పులివెందులలో ప్లాంట్ ఏర్పాటు చేయించారు.
భూములు నిర్వీర్యం… పడిపోతున్న ప్రజల ఆరోగ్య ప్రమాణాలు..!
ప్లాంట్ నుంచి వస్తున్న కాలుష్యం వల్ల చుట్టుపక్కల పొలాలన్నీ నిర్వీర్యం అయ్యాయి. ప్రజలు క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. కేకే కొట్టాల, కనంపల్లె అనే రెండు గ్రామాల్లో టెయిలింగ్‌పాండ్ వలన అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తేలింది. ఈ రెండు గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించాలని నిర్ణయించారు. కానీ.. పులివెందుల మొత్తం.. ఈ యూరేనియం ప్రభావం ..కనిపిస్తోంది. క్యాన్సర్ రోగులు పెరుగుతున్నారు. కానీ ఏపీ సర్కార్ మాత్రం లైట్ తీసుకుంటోంది. అధికారంలో లేనప్పుడు.. ఆ ప్లాంట్‌పై వైసీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తూ ఉంటారు . అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం భిన్నంగా మాట్లాడతారు.
ఇప్పుడు ప్లాంట్ విస్తరణకు అనుమతి.. ఫిర్యాదులు లేని అమరరాజాపై కక్ష..!
ప్రస్తుతం పులివెందులలో యురేనియం కర్మాగానికి అనుబంధంగా.. మరో కర్మాగారం ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. రెండవ ప్లాంట్‌తో పాటు మొదటి ప్లాంట్‌ను కూడా విస్తరణ చేస్తూ యూఐసీఎల్ కంపెనీ వేగంగా చర్యలు చేపట్టింది. పులివెందుల వద్ద ఉన్న యూసీఐఎల్ దేశంలోనే అతిపెద్ద యురేనియం ఉత్పత్తి కేంద్రంగా మారబోతోంది. రెండు శుద్ధికర్మాగారాల ద్వారా రోజుకు దాదాపు 9వేల టన్నుల ముడియురేనియంను శుద్ధిచేయాలనే లక్ష్యంతో యూరేనియం కర్మాగార యాజమాన్యం యూసీఐఎల్ ముందుకు సాగుతోంది. ప్రభుత్వం సహకరిస్తోంది. కడప జిల్లాలో ఒక్క యూరేనియం పరిశ్రమ మీద మాత్రమే కాదు.. భారతి సిమెంట్స్… జువారీ సిమెంట్స్ వంటి పరిశ్రమలపైనా కాలుష్యం ఆరోపణలు ఉన్నాయి. కానీ రాజకీయ ప్రత్యర్థుల వేటకు మాత్రమే.. ఈ పీసీబీని వాడుకుంటూండటంతో సమస్య వస్తోందని అంటున్నారు.