ఆంధ్రప్రదేశ్ అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం 24వ తేదీన సొమ్ములు చెల్లించాలని నిర్ణయించింది. గత ఏడాది రూ.10 వేలలోపు సొమ్మును డిపాజిట్ చేసిన వారికి రూ. 260కోట్లకుపైగా చెల్లించింది. ఇప్పుడు రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లించనున్నారు. అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేసిన వారు ఆధారాలతో వాలంటీర్ల వద్ద నమోదు చేయించుకోవాలని సీఐడీ ప్రకటించింది. పన్నెండో తేదీ వరకూ సమయం ఇచ్చింది. అయితే కొన్ని షరతులు పెట్టింది. ఒక వ్యక్తి.. నాలుగైదు సార్లు అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేసినా.. ఒక్క సారి మాత్రమే చెల్లిస్తారు. ఒక డిపాజిట్‌దారు ఒక క్లెయిమ్‌కే అర్హులు. గతంలో క్లెయిమ్ పొందిన వారికి ఇవ్వరు.
అగ్రిగోల్డ్ స్కాం గత ఎన్నికలకు ముందు పెద్ద రాజకీయ అంశం అయిపోయింది. లక్షల్లో బాధితులు ఉండటంతో వారందరికీ తాము అధికారంలోకి రాగానే సొమ్ము చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి బడ్జెట్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1150 కోట్లు కేటాయిస్తా. డిపాజిటర్లందరికీ న్యాయం చేస్తానని జగన్ పాదయాత్రలో ప్రతీ చోటా చెప్పారు. చెప్పినట్లుగా తొలి బడ్జెట్లో రూ. 1150 కోట్లు పెట్టారు. కానీ బాధితులకు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఆస్తులు అమ్మి కోర్టులో జమ చేసిన.. రూ. 260 కోట్లను మాత్రం పంచారు. ఇప్పుడు .. రెండో విడత రూ. ఇరవై వేల వరకూ డిపాజిట్ చేసిన వారికి పంచుతున్నారు.
అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ అమ్మేస్తే.. డిపాజిటర్లకు న్యాయం జరుగుతుంది. ఎవరి డబ్బులు వారికి వస్తాయి. మొత్తంగా రూ.4109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఒడిశాలోని ఆస్తులు వీటిలో ఉన్నాయి. ఈడీ అటాచ్ చేసిన వాటిలో ఏపీలోని 56 ఎకరాల హాయ్‌లాండ్ కూడా ఉంది. అలాగే పలు కంపెనీల్లో వాటాలు, యంత్రాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ అమ్మిస్తే.. ఏ ఒక్కరూ నష్టపోరని అంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు అనుమతితోనే రూ. 20వేల లోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లింపులు చేస్తున్నారు.