తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్‌కు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆయనపై నమోదైన కోర్టు ధిక్కార కేసుల విచారణకు రూ. 58 కోట్లు విడుదల చేసినట్లుగా జీవో వచ్చింది. దానిపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా ఎలా ప్రజాధనాన్ని ఖర్చు పెడతారని ఆశ్చర్యపోయిన హైకోర్టు.. ఆ నిధులను డ్రా చేయవద్దని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది. వివరణ ఇవ్వాలని సీఎస్‌కు వ్యక్తిగతంగా కూడా నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు విని ఒక్క సారిగా షాక్ అయిన సోమేష్ కుమార్.. హైకోర్టు చాలా సమయం ఇచ్చినప్పటికి తర్వాతి రోజే.. హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు.
ఆ రూ. 58కోట్లు తనపై కోర్టు ధిక్కార కేసులకు కాదని.. కోర్టు ధిక్కార కేసుల్లో కోర్టు ఆదేశించిన వారికి పరిహారం ఇవ్వడానికని ఆయన వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని విచారణ సందర్భంగా హైకోర్టు దృష్టికి తీసుకురావడంలో విఫలమయ్యామని ఆయన తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ నిధులు విడుదల చేయవద్దని ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరారు. సివిల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న ఎగ్జిక్యూషన్ పిటిషన్లలో డబ్బు చెల్లించడం ఆగిపోతుందన్నారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని వాదించారు. అయితే జీవో ఏముందని హైకోర్టు ప్రశ్నించింది.
జీవో కోర్టు ధిక్కరణ ఖర్చుల కోసమేనని ఉండటంతో ప్రభుత్వం తరపు న్యాయవాదికి సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. జీవోలు కనీస పరిశీలన లేకుండా ఎలా జారీ చేస్తారని.. న్యాయశాఖ పరిశీలించదా అని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. జీవో జారీలో నిర్లక్ష్యం వల్ల.. అటు నిర్వాసితులకు .. ఇటు సీఎస్‌కు చిక్కులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కోర్టు ఉత్తర్వులను వెనక్కి తీసుకోగలిగేలా ఒప్పించకపోతే… సీఎస్‌కు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.