” మేం ఆడితే ఇండియానే ఊగదా..” అని నిరూపిస్తున్నారు ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు. అసలు ఒక్క పతకమైనా తెస్తారా అని పెదవి విరిచిన సందర్భం నుంచి.. స్వర్ణాల ఆశలు కల్పించేవరకూ ఆటతీరు మెరుగుపడింది. గతంలో పోలిస్తే నిస్సందేహంగా భారత క్రీడా ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు హాకీలో మాత్రమే భారత్‌కు స్వర్ణం వచ్చేది. తర్వాత అదీ కూడా రావడం మానేసింది. తర్వాత తర్వాత అసలు పతకాల పట్టికలో చోటే లేదు. కానీ.. 1996 నుంచి రాత మారిపోయింది.
ప్రజల మనసుల్లో పతకం నాటిన లియాండర్ పేస్..!
అది 1996 సంవత్సరం..! దేశం కాదు.. ప్రపంచం మొత్తం ఒలింపిక్స్ ఫీవర్‌తో ఊగిపోతోంది. చైనా, రష్యా, అమెరికా పతకాల పట్టికలోఎవరు అగ్రస్థానంలో ఉంటారో ప్రజల మధ్య చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఇప్పట్లోలా అప్పట్లో సోషల్ మీడియా లేదు.. వాట్సాప్ అంత కంటే లేదు.. సెల్ ఫోన్లు అసలు లేవు. ఏ ఆసక్తికర చర్చ అయినా ముఖాముఖినే. అలాంటి సందర్భంలో ఎవరూ కూడా ఇండియాకు పతకాల పట్టికలో చోటు దొరుకుతుందని ఆశలు పెట్టుకోలేదు. ఎందుకంటే అంతకు ముందు రెండు ఒలింపిక్స్‌లలో భారత్‌కు పతకాల పట్టికలో చోటు లేదు. పతకాల పట్టికలో కాదు కదా.. అసలు స్థాయి ప్రమాణాలు చూపించిన ఆటగాళ్లు కూడా లేరు. అందుకే భారత్ గురించి.. భారతీయులు కూడా పట్టించుకోలేదు. కానీ టోర్నీ చివరికి వచ్చే సరికి అనూహ్యంగా భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించారు. అంతే.. ఒక్క సారిగా దేశం బ్లాస్ట్ అయిపోయింది. మనకూ ఓ పతకం వచ్చిందనేదే ఆ సంతోషం. ఒలింపిక్స్ పతకాల పట్టికలో చోటు దక్కిందని సంబరం. ఒక్క గెలుపు ఎంత కిక్ ఇస్తుందో… తెలిసిన సందర్భం. ఆటలకూ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజల్లో .. తల్లిదండ్రుల బుర్రల్లో ఓ ఆలోచన మెదిలిన క్షణం. బహుశా.. ఈ రోజు ఒలింపిక్స్‌లో భారత తరపున పోటీ పడుతున్న ఆటగాళ్లు.. వచ్చే ఒలింపిక్స్‌కో.. మరో ప్రతిష్టాత్మక క్రీడా పోటీలకో సిద్ధమవుతున్న వారికి అలాంటి విజయాలే స్ఫూర్తి కావొచ్చు. కానీ అప్పట్నుంచి భారత క్రీడాలోకంలో ఓ స్పష్టమైన మార్పు మాత్రం కనిపిస్తోంది. ఆ మార్పు చాలా స్లోగానే ఉండవచ్చు కానీ.. పురోగతిలో మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. లియాండర్ పేస్ స్వతహాగా డబుల్స్ ప్లేయర్. కానీ ఆయన సింగిల్స్‌లో చరిత్ర సృష్టించే విజయం సాధించి… మార్పు ప్రారంభించారు. ఆ తర్వాత నుంచి ఒలింపిక్స్‌లో ఎప్పుడూ భారత్ ఖాతాలో సున్నా లేదు. 2000 ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరీ వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్యం అందుకున్నారు. ఆ తర్వాత పతకాల పట్టిక అలా కొనసాగుతూనే వస్తోంది. బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో స్వర్ణం సాధించి అభినవ్ భింద్రా చరిత్ర సృష్టించారు. మనకు ఇప్పటి వరకూ మళ్లీ స్వర్ణాలు దక్కకపోవచ్చు కానీ.. భింద్రా స్ఫూర్తితో ఆటల్లోకి వచ్చిన వారికి కొదవలేదు. ఆ తర్వాత నుంచి బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్. బ్యాడ్మింటన్ ఆటగాళ్లు అంతకంతకూ మెరుగుపడుతూనే వస్తున్నారు. ఈ ఏడాది ఒలింపిక్స్ నాటికి ఎంత మెరుగుపడ్డామో వారి ఆట తీరు ద్వారానే తెలిసిపోతోంది.
గెలుపు కాదు.. ప్రయత్నమే ముఖ్యమనే మంత్రమే క్రీడా భారత వెలుగులకి మొదటి మెట్టు..!
టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల పోరాటపటిమ … ఉత్సాహం చూసిన తర్వాత ఆటల్లో భారత్‌కు ఉజ్వల భవిష్యత్ ఉండబోతోందని.. సగటు క్రీడా ప్రేమికుడికి సులువుగానే అర్థమైపోతుంది. మీరాబాయి చాను, పీవీ సింధు, లవ్లీనా, రవికుమాల్ దహియా, హాకీ టీం రజత, కాంస్య పతకాల వరకూ వెళ్లి ఉండవచ్చు.. కానీ వారి శ్రమ స్వర్ణాలకు తక్కువేం కాదు. ఇప్పటికీ పతకాల రేసులో భారత ఆటగాళ్లు ఉన్నారు. అధ్లెటిక్స్‌లో ఇంత వరకూ భారత్‌కు పతకం దక్కలేదు. ఈ సారి ఆ కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది. జావెలిన్ త్రోలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న నీరజ్… గ్రూప్ ఏ మ్యాచ్‌లో 86.65 మీటర్లకు జావెలిన్ విసిరి ఫైనల్ చేరుకున్నారు. శనివారం జరగనున్న ఫైనల్స్‌లో భారతీయుల మనసు గెల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పురుషుల జట్టు ఇప్పటికే కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మరోవైపు మహిళల జట్టు కూడా కాంస్యం కోసం బ్రిటన్‌తో ఆగస్టు 6న తలపడనుంది. అక్కడా కాంస్యం గెలుచుకునేందుకు మహిళలు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తారు.. అందులో సందేహం లేదు.
పతకం తేలేకపోయినా వారంతా వజ్రాలే..!
పతాకాల వరకూ రాలేకపోయిన ఆటగాళ్లు పరాజితులు కానే కాదు. వారు కూడా అద్భుతమైన విజయాలు సాధించారు. వినేష్ ఫోగట్ ఆట తీరు నుంచి ఎంత పొగిడినా తక్కువే. పతకం తేలేదన్న కారణంగా ఆమెను తక్కువ చేస్తే.. భారత క్రీడాలోకానికే అవమానం. ఒక్క వినేష్ ఫోగట్ మాత్రమే కాదు. మరో రెజ్లర్ దీపక్ పూనియా 86 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో సెమీస్‌కు చేరారు. కానీ అక్కడ అదృష్టం కలిసి రాలేదు. ఇక కమల్ ప్రీత్ గురించి ఎంత చెప్పినా తక్కువ.ే మహిళల డిస్కస్ త్రోలో కమల్‌ప్రీత్ పతకం సాధిస్తారని అంతా ఆశించారు. 64 మీటర్లకు డిస్కస్ త్రో విసిరి ఆమె ఫైనల్స్‌లో చోటు సంపాదించారు. కానీ ఫైనల్స్‌లో కమల్‌ప్రీత్ ఆరో స్థానంలో నిలిచారు. మొదటి సారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న కమల్ ప్రీత్.. భవిష్యత్‌లో ఒలింపిక్స్ మెడల్ కలను సాకారం చేసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె వజ్రం. ఇక మేరీ కోమ్ పతకం తేకపోవచ్చు కానీ ఆమెను స్ఫూర్తిగా తీసుకోని ఆటగాడు కానీ.. ఔత్సాహిక ప్లేయర్ కానీ ఉంటారా…? ఆర్చరీ రీకర్వ్ కేటగిరీలో ప్రపంచ నంబర్ 1గా కొనసాగుతున్న దీపికా కుమారి నిరాశపరిచారు. ఆమె ఒత్తిడికి గురయ్యారు. 15 మంది షూటర్లతో వెళ్లిన భారత బృందం కచ్చితంగా పతకాలు సాధిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఫలితాలు ఊహించిన స్థాయిలో రాలేదు. వారికి సాంకేతిక సమస్యలు అడ్డం వచ్చాయి. కానీ ఎవరినీ తక్కువ చేయలేం.. అందరూ అద్భుతమైన ఆటగాళ్లే.
మార్పు మొదలైంది.. కానీ స్లోగా..! ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తే క్రీడా విప్లవమే..!
ఒకప్పుడు ఒక్క పతకం రావడమే గగనం అనుకునే పరిస్థితి నుంచి.. పాల్గొన్న ప్రతి ఈవెంట్‌లోనూ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితికి భారత క్రీడా రంగం ఎదిగింది. ఇతర దేశాలతో పోలిస్తే.. ఇది స్లోనే కావొచ్చు. కానీ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో.. క్రీడలపై దృష్టి పెట్టే యువత చాలా తక్కువ. అదీ కూడా.. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల కోసమో… మరో అవసరం కోసమో… అడుగు పెడతారు కానీ.. ఇలా ప్రపంచవ్యాప్తంగా.. తమదైన ముద్ర వేయాలని తపన పడేవారు తక్కువ. అలా ఉన్నా.. వారికి కావాల్సిన స్థోమత ఉండదు. స్పాన్సర్లు రారు. క్రికెటే మతమైనపోయిన దేశంలో ఇతర క్రీడలు బతకడం చాలా కష్టం. ఆ పరిస్థితిని ఇతర క్రీడలన్నీ చూశాయి. చూస్తున్నాయి. కానీ.. పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడే.. అవి బతుకుతాయి. అలాంటి మార్పు అసామాన్యుల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. హాకీ టీంకు కనీస సౌకర్యాల కోసం డబ్బులు లేనప్పుడు.. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్.. రూ. వంద కోట్ల స్పాన్సర్ షిప్ ఇచ్చారు. ఆయన పుణ్యమా అని.. జాతీయ క్రీడ హాకీ బతికింది. ఇప్పుడు పతకం తీసుకు వచ్చింది. మహిళా టీంకు ఒడిషా సర్కార్ స్పాన్సరే. అలాంటి మార్పు విస్తృతంగా వచ్చినప్పుడే.. మరింత వేగంగా దేశంలో క్రీడలు అభివృద్ధి చెందుతాయి.
ప్రభుత్వాలు కనీస బాధ్యతగా భావిస్తే ప్రపంచంలోనే మేటి అవ్వడం ఖాయం..!
దేశంలో 130కోట్ల మంది ఉంటే వచ్చేది .. తెచ్చేది ఐదారు పతకాలేనా అని నిట్టూర్చేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. కానీ.. 30 లక్షల జనాభా ఉన్న దేశంలో ఉన్న క్రీడా మౌలిక సదుపాయాలు .. ఇక్కడ 30కోట్ల మంది ఉన్న రాష్ట్రంలో అయినా ఉంటాయా..? ఊహించలేం. అది అసాధ్యం కూడా. మన దేశంలో స్టేడియాలు ఉంటాయి.. కానీ బడాబాబుల పెళ్లిళ్లకు.. ఈవెంట్లకు వాడుతూ ఉంటారు. రాష్ట్రాలు పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తారు. కానీ అదంతా.. ఎటు పోతుందో చెప్పలేరు. ఇలాంటి పరిస్థితుల నడుమ.. ఆటగాళ్లు… అష్టకష్టాలకు ఓర్చీ.. దేశానికి పతకాలు తెస్తున్నారు. ఇదే మార్పు.. ప్రభుత్వాల్లోనూ.. సాధారణ ప్రజల్లోనూ మార్పు వస్తే.. చైనా, అమెరికా, రష్యాలతో పోటీ పడే క్రీడావని భారత్‌లో సాక్షాత్కరిస్తుంది. ఆ మార్పు ఎంత వేగంగా జరిగితే.. అంత వేగంగా…ఆ క్షణం వస్తుంది..!