ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రిగా… తెలంగాణ ప్రభుత్వంలో సీఎం స్థాయి అధికారాలు చెలాయిస్తున్న నేతగా .. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎలా చూసినా… కేటీఆర్‌కు హుజూరాబాద్ ఎన్నికల విషయంలో ప్రత్యేక బాధ్యత ఉంటుంది. అయితే కేటీఆర్ మాత్రం.. హుజూరాబాద్ వైపు చూడటం లేదు. మెదక్ జిల్లా మంత్రి హరీష్ రావుకు కేసీఆర్ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పటి వరకూ తెర వెనుక పని చేసిన ఆయన ఇప్పుడు.. నేరుగా హుజూరాబాద్‌లో అడుగుపెట్టి పరిస్థితుల్ని చక్క దిద్దుతున్నారు. మాములుగా అయితే.. ఇలాంటి ఎన్నికల బాధ్యతలన్నీ చాలా కాలంగా కేటీఆర్‌కే ఇస్తూ వస్తున్నారు కేసీఆర్. కానీ ఈ సారి మాత్రం… ఆయన కేటీఆర్ కన్నా.. హరీష్ రావుకే ప్రాధాన్యం ఇచ్చారు.
కేసీఆర్ ఇచ్చిన బాధ్యతల్ని హరీష్ శక్తివంచన లేకుండా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హుజూరాబాద్‌లోనే మకాం వేసి.. ఇతర పార్టీల నేతల్ని ఆకర్షిస్తున్నారు. చేరికల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈటల రాజేందర్‌పై విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్‌ను ఉపఎన్నిక బాధ్యతలకు దూరంగా పెట్టడంపై టీఆర్ఎస్లోనే భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. హుజూరాబాద్‌లో గెలుపు అంత సులువు కాదు కాబట్టి… ముందు జాగ్రత్తగా ట్రబుల్ షూటర్లా పేరున్న హరీష్ రావును రంగంలోకి దించారని కొంత మంది అంటున్నారు. కానీ అక్కడ గెలిచే చాన్స్ లేదని.. హరీష్ రావును బాధ్యుడ్ని చేయడానికే రంగంలోకి అక్కడకు పంపించారని మరికొంత మంది వాదిస్తున్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలు ఉద్యమకారునికి.. ఇతరుల మధ్య పోటీగా మార్చేందుకు ఈటల రాజేందర్ ప్రయత్నిస్తూండటంతో ..దానికి చెక్ పెట్టేందుకు కేసీఆర్.. ఉద్యమకారుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న హరీష్ రావును ఉపయోగించుకుంటున్నారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ఈటల రాజేందర్.. టీఆర్ఎస్లో కేసీఆర్ కన్నా ఎక్కువగా హరీష్‌కు సన్నిహితుడని చెప్పుకుంటారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆదేశాలను వీరిద్దరే పక్కగా అమల్లో పెట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేవారు. ఏ విధంగా చూసినా హుజూరాబాద్ ఎన్నికలను డీల్ చేయాల్సింది హరీష్ రావేనని.. కేటీఆర్ కాదని ఆ దిశగానే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ వర్గాలు సర్ది చెప్పుకుంటున్నాయి.