నదీ బోర్డు భేటీకి తాము హాజరు కాబోమని సమాచారం పంపిన తెలంగాణ సర్కార్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. 9వ తేదీన నదీ బోర్డు ఉమ్మడి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే తాము రాలేమని తెలంగాణ సమాచారం ఇచ్చింది. కానీ సీఎం కేసీఆర్ అనూహ్యంగా ఈ అంశంపై సమీక్షా సమావేశం పెట్టారు. బోర్డుల సంయుక్త సమావేశంలో అనుసరించాల్సిన ఉన్నతాధికారులతో చర్చించారు. సమావేశాల్లో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. దీంతో తెలంగాణ నదీ బోర్డుల సమావేశాలకు హాజరవబోతోందని క్లారిటీ వచ్చింది.
కృష్ణా, గోదావరి నదీ బోర్డులు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రెండు నదీ బోర్డులు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. 9వ తేదీన హైదరాబాద్లోని జలసౌధలో ఈ సమావేశం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం నదీ బోర్డులను నోటిఫై చేయడం.. అందులో అన్ని ప్రాజెక్టులను చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏపీ మాత్రం.. నోటిఫై చేయడాన్ని అంగీకరించినా… వాటిలో అన్ని ప్రాజెక్టులను చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఇప్పుడు నదీ యాజమాన్య బోర్డులే కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ చిన్న విషయానికి ప్రాజెక్టుల విషయంలో బోర్డుల అనుమతి తీసుకోవాల్సిందే. దీంతో ఈ గెజిట్ను అంగీకరించేందుకు నిన్నటి వరకూ సిద్ధంగా లేమని చెప్పిన తెలంగాణ సర్కార్ .. ఇప్పుడు.. సమావేశాలకు హాజరై.. తమ హక్కుల గురించి గళమెత్తాలని నిర్ణయించుకుంది. నీటివాటాలకు సంబంధించి బచావత్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం న్యాయమైన వాటాను దక్కించుకోవడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 8న మరోమారు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. అప్పుడు నిధుల విడుదల గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.