గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాను అదానీకి అమ్మేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్లో ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వానికి రూ.645.10 కోట్లు ఆదాయం సమకూరనుంది. ఇప్పటికే పోర్టులో 89.6శాతం వాటాను అదానీ సంస్థ ఇతరుల నుంచి కొనుగోలు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వంద శాతం పోర్టు అదానీ పరం అవుతుంది. గంగవరం పోర్టు వాటాల అమ్మకానికి అధికారిక మద్ర వేసేందుకు గతంలోనే కార్యదర్శుల కమిటీని ప్రభుత్వం నియమించింది. వారిచ్చిన నివేదిక ఆధారంగానే పోర్టులోని ప్రభుత్వ వాటాల్ని అమ్మేస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది.
గంగవరంలో పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 1,800 ఎకరాలు ఇచ్చింది. ప్రతిఫలంగా ప్రభుత్వానికి 10.4 శాతం వాటా ఇచ్చారు. ఈ వాటానే ప్రభుత్వం అమ్మేస్తోంది. భూమి బదలాయించడం ద్వారా ప్రభుత్వానికి వాటా సంక్రమిస్తే దానిని ఉపసంహరించుకునేటప్పుడు సరైన విధానంలో ఆ వాటాను లెక్కించాలి. పారదర్శక విధానంలో జరగాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అలాంటిదేమీ ప్రభుత్వం చేయలేదని విమర్శలు ప్రారంభమయ్యాయి. పోర్టును అభివృద్ధి చేసిన కంపెనీ ద్వారా ప్రభుత్వానికి లీజు, 2.1 శాతం రెవెన్యూ వాటా, డివిడెండ్ల రూపేణా ఇప్పటివరకూ సుమారు రూ.300 కోట్ల వరకు వచ్చింది. ఇక నుంచి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాదు.
ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉంది. అన్నింటినీ అమ్మేస్తోంది.తాకట్టు పెడుతోంది. ఇలాంటి సమయంలో రూ. 640 కోట్లు వచ్చే అమ్మకాన్ని కాదనే అవకాశం లేదు. అయితే.. కేబినెట్లో మాత్రం ఈ పోర్టు వాటా అమ్మేసి.. ఏపీ కట్టాలనుకుంటున్న ఇతర పోర్టుల్లో ఈక్విటీ కోసం వాడాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతోంది. కానీ పోర్టులు కడతారో లేదో.. రెండున్నరేళ్ల నుంచి కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. మొత్తానికి గంగవరం… వంద శాతం అదానీ పరం అవుతోంది. భూములిచ్చిన ఏపీ ప్రభుత్వం నిమిత్తమాత్రంగా మిగలబోతోంది.