వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగానే బెయిల్ రద్దు భయం పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు సైలెంట్‌గా ఉన్నా.. ఢిల్లీ స్థాయి నేతలు కొంత మంతి మాత్రం బెయిల్ రద్దు గురించి మాట్లాడుతున్నారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చేసి.. బెయిల్ రద్దవుతుందని మీకెలా తెలుసంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. టీడీపీ నేతలు చాలా కాలంగా జగన్ బెయిల్ రద్దవుతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ మీకెలా తెలుసు అని సజ్జల అడగలేదు. కానీ బీజేపీ నేతల్ని మాత్రం అడుగుతున్నారు. దీనికి కారణం ఒక వేళ జగన్ బెయిల్ రద్దు అయితే.. కేంద్రంలో ఉన్న బీజేపీనే చేయించింది అన్న అభిప్రాయం ప్రజల్లో కల్పించడానికి సజ్జల వ్యూహాత్మకంగా ఇలాంటి విమర్శలు చేస్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును టార్చర్ పెట్టడంతో ఆయన తన సమయం మొత్తం వైసీపీపైన.. ఆ పార్టీ అధినేతపైనే దృష్టి కేంద్రీకరించారు. ఆయన వేసిన బెయిల్ రద్దు పిటిషన్‌పై 25వ తేదీన విచారణ జరగనుంది. ఇప్పటికే సీబీఐ తన అభిప్రాయం చెప్పడానికి నిరాకరించడంతో ప్రజలు .. మరోలా అనుుంటున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం… దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలని అనుకోవడం లేదు. ఖచ్చితంగా బెయిల్ రద్దు చేస్తారేమోనన్న ఆందోళనలతో బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారు. లేనిపోని రాజకీయ ఉద్రిక్తతలు పెంచుకుంటున్నారు.
గతంలో అక్రమాస్తుల కేసుల్లో తమిళనాడు సీఎం జయలలిత అనేక సార్లు సీఎం పదవిలో ఉండగానే జైలుకెళ్లారు. అలాంటి పరిస్థతి జగన్‌కు వస్తుందేమో అని.. వైసీపీ నేతలు కంగారుపడి.. దానికికారణం బీజేపీనేనని ముందుగానే విమర్శించడం ప్రారంభించారని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా వారు న్యాయస్థానాలను ప్రభావితం చేస్తారని సజ్జల పరోక్షంగా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నారు. దీనిపై ఏపీ బీజేపీ నేతలు సైలెంట్‌గా ఉన్నారు. అందుకే వారిపై ప్రజల్లో అలాంటి భావం బలపడినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.