మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బీఎస్పీలోచేరుతున్నారు. నల్గొండలో రాజ్యాధికార సంకల్ప సభలో పేరుతో బలప్రదర్శన ఏర్పాటు చేశారు. సభకోసం బీఎస్పీ రాష్ట్ర నాయకులు, స్వేరో ప్రతినిధులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అవడానికి ఐపీఎస్ అధికారే అయినా.. ఆయన గత తొమ్మిదేళ్లుగా పోలీసు ఉద్యోగం చేయడం లేదు. సాంఘిక సంక్షేమ శాఖలో పని చేస్తున్నారు. ప్రభుత్వ గురుకులాల బాధ్యతలు తీసుకున్నారు. స్వేరో భావజాలాన్ని విస్తృతంగా వ్యాపించ చేశారు. పదవికి రాజీనామా చేసి… రంగంలోకి దిగారు. రాజకీయఅధికారమే లక్ష్యమంటున్నారు. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల వారీగా ప్రవీణ్‌కుమార్ వరుస సమావేశాలు నిర్వహించారు.
మొత్తంగా దళితవాదమే వినిపిస్తున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేయడానికి ఆయన ఏ మాత్రం వెనుకాడటం లేదు. దళితులరు రాజ్యాధికారమే లక్ష్యమని.. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడూ సాధ్యం కాదని ఆయన చెబుతున్నారు. తన వద్ద డబ్బుల్లేవని, తన రాజకీయ కార్యాచరణకు ప్రతి ఒక్కరూ చందాలు వేసుకుని ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి ఇతర పార్టీలు ప్రయత్నించాయి కానీ ఆయన మాత్రం…బీఎస్పీ వైపే మొగ్గు చూపారు.
ఆంధ్రప్రదేశ్‌లో కానీ.. తెలంగాణలో కానీ.. బీఎస్పీకి ఎలాంటి క్యాడర్ లేదు. కానీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల్లో టిక్కెట్ రాని అభ్యర్థులంతా… బీఎస్పీ బీఫాం తెచ్చుకుని ఆ పార్టీ గుర్తుపై పోటీ చేస్తూ ఉంటారు. 2014 ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. 2019లో ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి.. చాలా కొద్ది తేడాతో ఓడిపోయారు. బీఫాంల పార్టీగా ఉన్న బీఎస్పీలో చేరి ప్రవీణ్ కుమార్ ఏంచేస్తారన్న అభిప్రాయం ఇతర పార్టీల నేతల్లో ఉంది. అయితే.. దళిత వర్గాల్లో బీఎస్పీకి పట్టు సాధించి పెడితే… అన్ని పార్టీలు తమ దగ్గరకే వస్తాయని ప్రవీణ్ కుమార్ భావిస్తున్నారని అంచనా వేస్తున్నారు.