ఆంధ్రప్రదేశ్‌లో న్యాయమూర్తుల్ని కించ పరుస్తూ, తిడుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టిన కేసుల్లో మరో ఐదుగుర్ని సీబీఐ అరెస్ట్ చేసినట్లుగా సీబీఐ ప్రకటించింది. రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్… న్యాయమూర్తులను వేధిస్తున్న వారి విషయంలోనూ సీబీఐ, ఐబీ నిర్లక్ష్యంగా ఉంటున్నాయని.. న్యాయవ్యవస్థకు సహకరించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో సీబీఐలో కదలిక వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆ కేసుకు సంబంధించి తాజాగా మరో ఐదుగుర్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. తాజా అరెస్టులతో ఎనిమిది మందికి చేరినట్లుగా తెలుస్తోంది.
ఉన్నత న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యల కేసులో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. గతంలో హైకోర్టులో ప్రభుత్వానికి తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయన్న కారణంగా సోషల్ మీడియాలో విపరీత వ్యాఖ్యలు చేశారు. వారి వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి, ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్, జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వంటి వారు సహా మొత్తం 90మందికి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఈ కేసులో ఎంపీ నందిగం సురేష్, ఆమంచి కృష్ణమోహన్‌లను ప్రశ్నించే అవకాశం ఉందని సీబీఐ తెలిపింది. జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో భారీ కుట్ర ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది.
హైకోర్టు నోటీసులు జారీ చేసినా సీఐడీ పట్టించుకోకపోవడంతో కేసును సీబీఐకి ఇచ్చింది. సీబీఐ కూడా లైట్ తీసుకుంది. ఇటీవలి కాలంలో ఒకరిద్దర్ని అరెస్ట్ చేసింది. కానీ రెండురోజుల క్రితం.. సాక్షాత్తూ సీజేఐనే అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇప్పుడు చురుగ్గా కదులుతున్నట్లుగా కనిపిస్తోంది ఎంపీ నందిగం సురేష్ అయితే న్యాయమూర్తుల కాల్ లిస్ట్ చెక్ చేయాలని డిమాండ్ చేశారు. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సుమన్ టీవీ అనే యూ ట్యూబ్ చానల్‌కు ప్రత్యేకంగా ఇంటర్యూ ఇచ్చి..న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీడియో క్లిప్‌లతో హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. పంచ్ ప్రభాకర్ అనే అమెరికాలో ఉండే వ్యక్తి దారుణంగా తిడుతూ ఉంటారు. ఆయనకూ నోటీసులు వెళ్లాయి. వీళ్లందరిపై సీబీఐ ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్‌ని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కీలక ఆధారాలు సేకరించారు. అంతా ఓ నెట్ వర్క్ ప్రకారం.. జరిగిందన్న ఆరోపణల నేపధ్యంలో సీబీఐ అరెస్టులు కలకలం రేపుతున్నాయి.