దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మరో నిర్భయ తరహా ఉదంతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. వారం రోజుల కిందట ఢిల్లీలో ఓ దళిత కుటుంబానికి చెందిన బాలికను నలుగురు దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. తర్వాత తల్లిదండ్రులకు తెలియకుండానే అంత్యక్రియలు నిర్వహించేశారు. విషయం బయటకు తెలిసిన తర్వాత రగడ ప్రారంభమైంది. అన్ని రాజకీయ పార్టీల నేతలూ ఆ దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ఆ బాలికకుటుంబానికి జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ కూడా వారి కుటుంబాన్ని పరామర్శించి.. “ఇండియాకీ భేటీ” కుటుంబానికి న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఓ దురదృష్టకర ఘటనను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపిస్తోంది. అంతే కాదు.. రాహుల్ గాంధీ ఆ బాలిక ఎవరో తెలిసేలా ట్వీట్ చేశారని.. ఆయనపై పోక్సో చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఆ బాలిక కుటుంబానికి జరిగిన అన్యాయంపై స్పందించని బీజేపీ.. ఇలా రాహుల్ ట్వీట్ చేశారన్నదాన్ని పెద్ద అన్యాయంగా చెబుతోంది. ట్విట్టర్‌కు ఫిర్యాదు చేసింది. ట్వీట్టర్‌కు జాతీయ మహిళా కమిషన్ కూడానోటీసులు జారీ చేసింది. అసలే ఒత్తిడిలో ఉన్న ట్విట్టర్.. రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా స్తంభింపజేసింది. ఇది కూడార రాజకీయ దుమారానికి కారణం అవుతోంది.
నిజానికి బాలిక తల్లిదండ్రుల ఫొటోలను కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కాదు, బీజేపీ నాయకులు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ సభ్యులు కూడా ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే ఒక్క రాహుల్ గాంధీని మాత్రమే టార్గెట్ చేశారు. మరో వైపు ఈ అంశంతో దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. యూపీలో జరిగిన అత్యాచార కేసుల దగ్గర్నుంచి అన్నింటిలోనూ నిందితుల్ని బీజేపీ కాపాడుతోందని విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి.గతంలో కాంగ్రెస్ హయాంలో ఢిల్లీలో జరిగిన నిర్బయ ఘటన ఆ పార్టీకి ఎంత నష్టం చేసిందో తెలుసు కాబట్టి.. ఎక్కువ ప్రచారం జరగకుండా బీజేపీ కట్టడి చర్యలు తీసుకుంటోంది. కానీ ఆ బాలనిర్భయ ఉదంతం మాత్రం పెగసస్ కన్నా పెద్ద అంశంగా మారింది.