సురేష్ బాబు తనయుడు అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి సురేష్ బాబునే నిర్మాత. ఆయనేమో… ప్రతీ రూపాయి ఆచి తూచి ఖర్చు చేసే రకం. తేజదేమో.. పట్టువిడవని వైఖరి. దాంతో ఇద్దరి మధ్యా అప్పుడే గ్యాప్ మొదలైందని సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకోవాలని తేజ భావించాడు. కృతితో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ కృతి మాత్రం కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేసింది. దాంతో సురేష్ బాబు వెనుకంజ వేశారు. `కృతి అయితే కోటి కదా… ఇంకొకర్ని తీసుకుందాం` అని తేజని వెనక్కి లాగారు. ఈ విషయంలో సురేష్ బాబుతో తేజ కాంప్రమైజ్ అయిపోయారు కూడా. ఇప్పుడు ఇలాంటి ఇష్యూనే మరోటి నడుస్తోంది. ఇందులో కీలకమైన పాత్ర కోసం సముద్రఖని పేరు రాసిపెట్టుకున్నాడు తేజ. సముద్రఖనితోనూ సంప్రదింపులు జరిపారు. ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి రెడీ. కాకపోతే.. మళ్లీ పారితోషికం దగ్గరే గొడవ. సముద్రఖని అడిగిన దానికి సురేష్ బాబు నో చెప్పడంతో తేజ మరో ఆప్షన్ వెదుక్కోవాల్సివస్తోంది. అడిగిన హీరోయిన్ని అయినా ఇవ్వలేదు.. కనీసం సముద్రఖనినైనా ఓకే చెబితే బాగుంటుందని తేజ భావిస్తున్నాడు. కానీ సురేష్ బాబు కి మాత్రం బడ్జెట్ పెరిగిపోతుందని భయం. సముద్రఖని విషయంలో మాత్రం తేజ వెనుకంజ వేయడం లేదని, ఈ విషయంలో పట్టుగా ఉన్నాడని, సురేష్ బాబుని ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడని, అందుకే ఆ పాత్ర తాలుకూ సీన్స్ బాలెన్స్ పెడుతున్నాడని టాక్. మరి సురేష్ బాబు ఏం చేస్తాడో?