వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు చెందిన ఆడియోలు అదే పనిగా లీకవుతున్నాయి. తాజాగా సుకన్య అనే మహిళతో సంభాషణలు జరుపుతున్నట్లుగా ఉన్న ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కువగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలే వైరల్ చేస్తున్నారు. గతంలో సంజన అనే యువతితో జరిగిన వ్యవహారాన్ని ఏబీఎన్- ఆంధ్రజ్యోతి చానల్ ప్రసారం చేసింది. అప్పట్నుంచి అంబటి రాంబాబు విషయంలో ఆ ఘటన ఓ మచ్చగా ఉంటుంది. ఈ సారి ఏ చానల్ ప్రసారం చేయలేదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొద్ది రోజుల కిందట అంబటి రాంబాబు లక్ష్మిపార్వతిని ఉద్దేశించి అనుచితంగా వ్యాఖ్యానించారంటూ ఓ ఆడియో కూడా సోషల్ మీడియాలో వచ్చింది. దాన్ని తన వాయిస్ కాదని అంబటి రాంబాబు ఖండించలేదు. ఇప్పుడు కూడా ఆయన దీనిపై ఎలాంటి స్పందన ఇంకా వ్యక్తం చేయలేదు. రెండు రోజుల నుంచి తిరుగుతున్నప్పటికీ.. ఆయన ఎందుకు మిన్నకుండిపోయారో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. అది ఫేక్ అయితే వెంటనే ఖండించి.. పోలీసులకు రిపోర్ట్ చేయడం వైసీపీ నేతలు చేసే పని . కానీ ఎందుకో అంబటి రాంబాబు మాత్రం ఇంకా పోలీసుల వరకూ వెళ్లలేదు.
త్వరలో రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన చేయబోతున్నారు. మొత్తం 90 శాతం మంది మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలో అంబటిని రేసు నుంచి తప్పించడానికే సొంత పార్టీ నుంచే ఇలాంటి లీకులు వస్తున్నాయని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే అంబటిరాంబాబు వర్గీయులు మాత్రం అసలేం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతున్నారు. తమ నాయకుడిపై ఇంటా బయటా కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.