మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజు కో కొత్త మలుపు తిరుగుతూ వుండడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత దానికి వ్యవస్థాపక అధ్యక్షుడు గా వ్యవహరించిన చిరంజీవి, తాజాగా క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు కు లేఖ రాశారు. మా ప్రతిష్ట మసకబారుతోంది అని, వీలైనంత త్వరగా ఎన్నికలు జరిపించాలని ఆయన అందులో కోరారు వివరాల్లోకి వెళితే..
ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత, నరసింహారావు – ఈ ఐదుగురు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల లో తలపడనున్నారు. అయితే ఇటీవల హేమ విడుదల చేసిన వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డబ్బులను సొంతానికి ఖర్చు పెట్టుకున్నాడు అంటూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనంగా మారడమే కాకుండా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పూనుకొని కృష్ణంరాజు కు లేఖ రాశారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఆనవాయితీగా జరుపుకునే ఎన్నికలు ఈ సారి కోవిడ్ 19 కారణంగా వాయిదా పడ్డాయని ప్రస్తుతం కొనసాగుతున్న ఆపద్ధర్మ కమిటీ అని, వీరి స్థానంలో శాశ్వత కమిటీ వస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలు కుదురుతుంది అని ఈ లేఖలో ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆలస్యం చేసిన కొద్దీ అసోసియేషన్ ప్రతిష్ట మసకబారుతోంది అని ఆయన అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో పెద్దలు, పైగా అన్ని విషయాలు తెలిసినవారు అయిన కృష్ణంరాజు వీలైనంత త్వరలో ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేయాలని చిరంజీవి కోరారు. అదే విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కూడా చిన్న చిన్న మనస్పర్ధల ని మీడియా ముందుకు తీసుకువచ్చి దానిని సమస్యగా మార్చడం కంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
మొత్తానికి చిరంజీవి లేఖ అనంతరం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.