తెలంగాణ కాంగ్రెస్‌లో దళిత, గిరిజన దండోరా ఉత్సాహం కనిపిస్తోంది. ఒక్క సభ కాదని వరుసగా సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అత్యంత ఆర్భాటంగా.. ప్రధాన మీడియాలో పెద్దగా చోటు దక్కకపోయినా సోషల్ మీడియా దన్నుతో కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమానికి మంచి మైలేజ్ తెచ్చుకుంది. అయితే కాంగ్రెస్‌లో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని.. వేదికపై మిస్సయిన కొంత మంది ముఖ్య నేతల్ని చూస్తేనే సులువుగా అర్థం చేసుకోవచ్చు. నిన్నటి వరకూ పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి … దిళిత, మాదిగ దండోరా గురించి పట్టించుకోలేదు. ఆయన రాలేదు. ఈ కార్యక్రమం గురించి ఆయన కాంగ్రెస్ క్యాడర్‌కు కనీసం ఓ సలహా.. దిశా నిర్దేశం చేసినట్లుగా లేదు. అంతకు మించి టీఆర్ఎస్ చేపట్టిన దళిత బంధు పథకంపైనా ఆయన స్పందించలేదు.
ఇక పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నించి విఫలమైన కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా హాజరు కాలేదు. వారు ఎప్పుడు ఎలా మాట్లాడుతారో… ఎవరికీ అర్థం కాలేదు. పీసీసీ చీఫ్ అయిన రేవంత్‌ను యాధృచ్చికంగా కలవడం తప్పితే ప్రత్యేకంగా పార్టీ బలోపేతం కోసం కలవలేదు. రేవంత్ వస్తానన్నా ఒప్పుకోలేదు. ఇక ఉత్తమ్ వర్గంగా పేరు తెచ్చుకున్న జగ్గారెడ్డి కూడా దళిత, గిరిజన దండోరాకు డుమ్మాకొట్టారు. పునరుజ్జీవం కోసం కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇలా సీనియర్లు పాలు పంచుకోకపోవడంతోనే ఇంకా టీ కాంగ్రెస్ ఏకతాటిపైకి రాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతూ వస్తోంది. దీన్ని రేవంత్ రెడ్డి కరెక్ట్ చేసుకోవాల్సి ఉంది.
అయితే క్యాడర్ అంతా ఏకపక్షంగా రేవంత్ రెడ్డి వెనుకాల నడుస్తున్నందున… రేవంత్ నాయకత్వంలో పని చేస్తున్నందున.. ఉండేవారు ఉంటారని.. లేనివారు పోతారని … రేవంత్ వర్గీయులు విశ్లేషించుకుంటున్నారు. ఇప్పటి వరకూ రేవంత్… సాధ్యమైనంత వరకూ పార్టీ నేతల్ని బుజ్జగించారని.. ఇక నుంచి చేయరని.. తన పని తాను చేసుకుపోతారని అంటున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూతో ఉత్తమ్ ఇమేజ్. హైకమాండ్ వద్ద కూడా దిగజారిపోయిందని రేవంత్ వర్గీయులు అంచనా వేస్తున్నారు. అతి సమీప బంధువైన పాడి కౌశిక్ రెడ్డిని ఉత్తమే ప్రోత్సహించారు చివరికి ఆయన కోవర్ట్ అయ్యారు. ఇదంతా ఉత్తమ్‌కు తెలియకుండా జరగదని హైకమాండ్‌కు రేవంత్ వర్గీయులు ఫిర్యాదులు పంపినట్లుగా తెలుస్తోంది.