మలయాళ సూపర్ హిట్ `నాయట్టు` రీమేక్ హక్కులు గీతా ఆర్ట్స్ చేతిల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది గీతా ఆర్ట్స్ ఉద్దేశం. అందుకే ఆఘ మేఘాల మీద నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. మూడు కీలక పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. ఇప్పటికే అంజలి, రావు రమేష్ల ఎంపిక పూర్తయ్యింది. మేల్ లీడ్ కోసం శ్రీవిష్ణు, సత్యదేవ్ ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం శ్రీవిష్ఱుతో సంప్రదింపులు జరుపుతున్నారు. తను ఓకే అంటే… తనే లీడ్ హీరో. కాదంటే.. అప్పుడు సత్యదేవ్ దగ్గరకు వెళ్తుందీ ఛాన్స్.
ఈ సినిమా ఒప్పుకోవడానికి శ్రీవిష్ణు కొన్ని కండీషన్లు పెడుతున్నట్టు టాక్. తను ప్రధానంగా ఓటీటీలో ఈ సినిమా విడుదల చేయడానికి ఒప్పుకోవడం లేదట. థియేటరికల్ రిలీజ్ అంటేనే, సినిమా చేస్తానని ముందే స్ట్రాంగ్ గా చెప్పేశాడట. కానీ గీతా ఆర్ట్స్ ఆలోచనలు వేరేలా ఉన్నాయి. ఈ సినిమాని ఆహా కోసం సెట్ చేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో గీతా ఆర్ట్స్ ఏదో ఒకటి తేలిస్తే తప్ప హీరో ఖరారు కాడు. దర్శకత్వ బాధ్యతని కరుణ కుమార్ కి అప్పగించారు. తనైతే ఈ సినిమాని అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయగలడని గీతా ఆర్ట్స్ నమ్మకం. ఇది వరకు గీతా ఆర్ట్స్ లో కరుణ కుమార్ `మెట్రో కథలు` వెబ్ సిరీస్ చేశాడు. అది ఆహాలో.. స్ట్రీమింగ్ అయ్యింది.