ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా పేరుతో రేవంత్ రెడ్డి నిర్వహించిన సభ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందేమో కానీ టీఆర్ఎస్ నేతలకు ఫ్రస్ట్రేషన్ తీసుకు వచ్చింది. రేవంత్ రెడ్డి ఆ సభలో చాలా దూకుడుగా మాట్లాడారు. తీవ్రమైన విమర్శలు చేశారు. దీంతో టీఆర్ఎస్ నేతలకు సహనం అదుపు తప్పింది. ఆ విషయం మీడియా ప్రెస్మీట్లలో వారు చేసిన వ్యాఖ్యలతోనే తేలిపోయింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జోగు రామన్న పూర్తిగా కంట్రోల్ తప్పి పోయారు.. కాళ్లు, చేతులు నరికేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాకే చెందిన ఇంద్రకరణ్ రెడ్డి రేవంత్ రెడ్డి నాలుక కోస్తామని హెచ్చరించారు. జోగు రామన్న హెచ్చరికలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు చేశారు. ఇరవై నెలల తర్వాత కేసీఆర్ ఉండేది జైల్లోనేనని హెచ్చరించారు.
రేవంత్ తరహాలో కౌంటర్ ఇవ్వడానికి కంగారు పడిపోయిన టీఆర్ఎస్ నేతలు చంపుతామని బహిరంగంగా బెదిరించడం హాట్ టాపిక్ అవుతోంది. జోగు రామన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి. ఒక్క జోగు రామన్న మాత్రమే కాదు.. టీఆర్ఎస్ మొత్తం రేవంత్ రెడ్డిపై విచురుకుపడింది. రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరక్షన్లో పని చేస్తున్నారని ఓ మంత్రి విరుచుకుపడితే.. గతంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాను దెయ్యం అన్న సంగతి మర్చిపోయారా అని మరొకరు వీడియోను కొంత మంది నేతలు చంద్రబాబుతో లింక్ పెట్టారు.. మరికొంత మంది నేతలు బీజేపీతో లింక్ పెట్టి విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఐదు దశాబ్దాల కాలంలో గిరిజనులకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. దళిత బంధు ప్రవేశ పెడితే… అక్కసుతోనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
టీఆర్ఎర్ నేతల నుంచి రేవంత్ రెడ్డి ఇలాంటి ఫ్రస్ట్రేషన్ ఎక్స్ పెక్ట్ చేసి ఉంటారు. టీఆర్ఎస్ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతే.. వరుసగా నేతలు ఇలా రేవంత్‌ను టార్గెట్ చేస్తూ ప్రెస్మీట్లు పెట్టరు. రేవంత్ విమర్శలకు ఇంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారంటే.. టీఆర్ఎస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని.. ఆయన ప్రజల్లోకి వెళ్తూ చేస్తున్న విమర్శలను చాలా సీరియస్‌గా తీసుకున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.