ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రోజువారీ కేసుల పర్యవేక్షణకు తామే ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులు.. నేర మయ నేతల వ్యవహారాల పిటిషన్లను మొదటి నుంచి జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ చూస్తోంది. మొదట్లో ఆయన ఏడాదిలో కేసుల సంగతి తేల్చాలని స్పష్టమైన ఆదేశాలివ్వడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. అదే సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జస్టిస్ ఎన్వీ రమణపై అనేక ఆరోపణలు చేస్తూ అప్పటి చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. సీక్రెట్‌గా ఉంచాల్సిన ఆ లే్ఖను అధికారికంగా బయట పెట్టి మీడియాలో విస్తృత ప్రచారం అయ్యేలా చేశారు.
అయితే అనేక అక్రమాస్తుల కేసుల్లో నిందితుడయిన ఏపీ సీఎం… న్యాయవ్యవస్థను బెదిరించడానికే ఇలాంటి లేఖలు రాశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. కేవలం ప్రజాప్రతినిధులపై కేసుల విషయంలో జస్టిస్ రమణ చురుగ్గా స్పందిస్తున్న కారణంగానే ఆయనను టార్గెట్ చేశారని అనేక మంది న్యాయనిపుణులు విమర్శించారు. తర్వాత ఏపీ సీఎం చేసిన ఆరోపణల్లో నిజం లేదని .. అప్పటి చీఫ్ జస్టిస్ బోబ్డే చేసిన అంతర్గత విచారణలో తేలింది. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను మరోసారి సీరియస్‌గా తీసుకున్నారు. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని… స్పందించకపోతే.. తామే ప్రత్యేకమైన బెంచ్ ను ఏర్పాటు చేస్తామని హెచ్చరించింది. సుప్రీంకోర్టు స్పందనతో కేసులు ఉన్న నేతల్లో మళ్లీ ఆందోళన ప్రారంభం కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో ఇలాంటి కేసులు ఉన్న నేతల వ్యూహం ఈ సారి ఎలా ఉంటుందో అన్న చర్చ జరుగుతోంది. గతంలో ఆరోపణలు చేసినట్లుగా మళ్లీ కొత్తగా ఏదైనా వ్యూహాన్ని అమలు చేస్తారా అన్న సందేహం చాలా మందిలో ప్రారంభమయింది. అయితే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే ధైర్యం ఇప్పుడు చేయకపోవచ్చని అంటున్నారు. సీబీఐ చాలా సీరియస్‌గా అరెస్టులు ప్రారంభించింది. నేతలు కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడానికి సాహసించకపోవచ్చని అంటున్నారు. ఇలాంటి సమయంలో… గతంలో ఆరోపణల వ్యూహాన్ని … సోషల్ మీడియాలో ప్రచార వ్యూహాన్ని అవలంభించిన నేతలు ఈ సారి సుప్రీంకోర్టుపై ఒత్తిడి తేవడానికి ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ నేతలపై కేసులు ఎత్తివేతకు అదే పనిగా ఆదేశాలు ఇస్తూండటానికీ సుప్రీంకోర్టుకు అడ్డుకట్ట వేసింది.
అయితే ఇప్పుడు… న్యాయవ్యవస్థపై ఎదురుదాడి చేసేంత సాహసం ఎవరూ చేయకపోవచ్చునని అంటున్నారు. సీజేఐ చాలా స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. న్యాయవ్యవస్థపై ఇప్పుడు ఏ రూపంలోఅయినా దాడికి పాల్పడితే.. ఇబ్బందికర పరస్థితుల్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందనిచాలామంది అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కేసులున్న నేతలకు టెన్షన్ తప్పదని భావిస్తున్నారు. అయితే ఏపీలో ఉన్నరాజకీయ నేతలు అలా ఆషామాషీగా వదిలేసే వారుకాదు.. దేనికైనా సిద్ధపడే నేతలు. అందుకే.. న్యాయవ్యవస్థపై వారి తదుపరి వ్యూహం ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రారంభమయింది.