సత్తెనపల్లి వెసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సవాల్ చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని చేధిస్తానని ప్రకటించారు. సోషల్ మీడియాలో రెండు లైన్ల పోస్ట్ పెట్టి వదిలేశారు. కానీ అసలు విషయాల గురించి చెప్పలేదు. తనపై ఎవరు కుట్ర చేస్తున్నారు..? ఎందుకు కుట్రలు చేస్తున్నారు..? సొంత పార్టీ వాళ్లా..? విపక్ష పార్టీ వాళ్లా..? అసలు ఏ అంశంలో కుట్రలు చేస్తున్నారు వంటి విషాయలను ప్రస్తావించలేదు. వాటన్నింటినీ సోషల్ మీడియాలో యూజర్ల ఊహాగానాలకు వదిలేశారు. ఇటీవల అంబటి రాంబాబుకు సంబంధించినదంటూ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది సుకన్య అనే మహిళ గురించి మాట్లాడిన ఆడియో. అయితే తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి చేస్తున్నప్రయత్నాలేనని ఆయన దీనిపై సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు.
రెండు రోజుల తరవాత తనపై కుట్రలు.. కుతంత్రాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పోస్టు పెట్టారు. ఈ రెండు రోజుల్లో ఆయన తనపై జరిగిన కుట్ర గురించిన ప్రాథమిక సమాచారం ఏమైనా తెలిసిందేమో కానీ.. హెచ్చరిస్తున్నట్లుగా పోస్టు పెట్టారు. అంబటి రాంబాబుపై ఎవరు కుట్ర చేస్తున్నారన్నదానిపై క్లారిటీలేదు కానీ విపక్ష పార్టీలు అలా కుట్ర చేస్తూంటే మాత్రం ఆయన లాంగ్వేజ్ వేరుగా ఉండేది. కానీ సొంత పార్టీ నేతలు చేస్తున్నారు కాబట్టే కాస్తంత మర్యాదగా పోస్టు పెట్టారని చెబుతున్నారు. ఆయనకు మంత్రి పదవి రాకుండా కొంత మంది చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వ్యక్తిగత విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్న ప్రచారం వైసీపీలో ఉంది.
పార్టీలోని కొంత మంది పెద్దలే ఈ అంశంలో కీలకంగా ఉన్నారని.. అంబటికి పదవి ఇవ్వడం ఇష్టం లేకనే ఈ తరహా వివాదాలను మీడియాలో.. సోషల్ మీడియాలో హైలెట్ చేసి .. ఆయనను రేస్ నుంచి తప్పించాలని చూస్తున్నారని అంటున్నారు. ఈ కారణంగానే ఆయన కుట్రలను చేధిస్తానని పోస్టులు పెట్టారని అంటున్నారు. మొత్తానికి అంబటికి ఇతర పార్టీల్లోని రాజకీయ ప్రత్యర్థుల కన్నా.. సొంత పార్టీలోని నేతలను ఎదుర్కోవడమే కష్టమైపోతోందన్న అభిప్రాయం ఆయన వర్గీయుల్లో ఏర్పడుతోంది.