పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఉభయసభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. ప్రభుత్వం తనకు కావాల్సిన బిల్లులను ఆమోదించుకుని వాయిదా వేసేసింది. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న పెగాసస్ అంశంపై చర్చించడానికి కేంద్రం అంగీకరించలేదు. సభ నిరవధిక వాయిదాకే్ మొగ్గు చూపింది. అయితే చివరి రోజు రాజ్యసభలో హైలెట్ సీన్ చోటు చేసుకుంది.. అదే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కన్నీరు పెట్టుకోవడం. సభా కార్యక్రమాలు అసలు జరగలేదని.. కొంత మంది అత్యంత దారుణంగా ప్రవర్తించారని ఆయన కంట తడి పెట్టుకున్నారు. పార్లమెంట్లో అనుచితంగా ప్రవర్తించడం అంటే గర్భగుడిలో అనుచితంగా ప్రవర్తించడమేనని ఆయన ఆవేదన చెందారు.
ఉపరాష్ట్రపతి అంత ఎమోషన్ ఎందుకు అవ్వాల్సి వచ్చిందో చూసేవారికి అర్థం కాలేదు కానీ… వెంకయ్యనాయుడు అలా మరీ కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మాత్రం అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే చర్చలు ప్రధానం. అలాంటి చర్యలు జరగలేదు. కానీ ఎందుకు జరగలేదో… ఒక్కసారి అయినా ఉపరాష్ట్రపతి లేదా కేంద్ర అధికారపార్టీ విశ్లేషించుకుందా అంటే..సమాధానం ఉండదు. ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారిన వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడిన పెగాసస్ అంశంపై దర్యాప్తు జరపాలని .. చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. కానీ ఆ అంశంపై చర్చ జరిపే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చేసింది. సభను అదేపనిగా వాయిదా వేయడానికి సిద్ధపడింది కానీ.. పెగసస్పై చర్చకు అంగీకరించలేదు.
ఓబీసీ బిల్లుపై చర్చకు అన్ని పార్టీలు సహకరించాయి.కేంద్రం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంది. మరి అలాంటప్పుడు పెగసస్ అంశంపై మాత్రం ఎందుకు చర్చించరు… అలా చర్చించకుండా… సభల్ని వాయిదా వేసి వెళ్లిపోవడమే కాకుండా.. ప్రతిపక్షాలు వృధా చేశాయని… కన్నీరు పెట్టుకుంటే ప్రయోజనం ఏముంటుందో అధికారపార్టీకే తెలియాలి. ఉపరాష్ట్రపతి అయినా రాజ్యసభ చైర్మన్ అయినా కేంద్రప్రభుత్వ విధానాల ప్రకారమే సభను నడపాలి. పెగసస్పై చర్చ జరపకూడదనేది కేంద్రం నిర్ణయం.. ఆ ప్రకారం వెంకయ్య వెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పెగసస్ అంశం తేలాలని విపక్షాలు భావిస్తున్నాయి. వారూ తమ పద్దతిలో పోరాడారు.
నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఉభయసభల్లో ఇంత కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పట్లో ఇప్పుడు కన్నీరు పెట్టుకున్న రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు.. సభను స్తంభింపచేసిన కాంగ్రెస్ అందరూ… ఆ దారుణాలు కరెక్టేనని వాదించారు. అప్పుడు ఎవరికీ కన్నీరు రాలేదు. అంధ్రులు మాత్రమే కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు చర్చలు జరగలేదని రాజ్యసభ చైర్మన్ కన్నీరు పెట్టుకుంటున్నారు.