రఘురామకృష్ణరాజుపై అనర్హతా వేటు వేయించకపోతే తన పలుకుబడి అంతా ట్రాష్ అని అనుకుంటున్నారేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిర్యాదులతో పాటు స్పీకర్‌కు ఉద్దేశాలు ఆపాదించి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసేందుకు కూడా వెనుకాడని ఆయన..అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని అనుకున్నారేమో కానీ చివరికి న్యాయశాఖ మంత్రికి లేఖ రాశారు. తక్షణం ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మార్చాలని కోరారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఓ పార్టీ గుర్తుపై గెలిచిన వారు మరో పార్టీలో చేరితే అనర్హులవుతారని .. కానీ ఆ షెడ్యూల్లో ఎప్పట్లోపు అనర్హతకు గురవుతారో.. ఎప్పట్లోపు స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలో లేదని అన్నారు.
ఆ కారణంగాచాలా మంది పార్టీ ఫిరాయింపు దారులు చర్యల నుంచి.. అనర్హతా వేటు గురించి తప్పించుకుంటున్నారన్నారన్నారు. గతంలో సుప్రీంకోర్టు మూడు నెలల్లోపు అనర్హతా పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని సూచనలు ఇచ్చిందని.. కానీ అమలుకావడం లేదన్నారు. వీటన్నింటికీ పరిష్కారం రాజ్యాంగ సవరణేనన్నారు. ఈ లేఖలో ఎక్కడా రఘురామకృష్ణరాజు ప్రస్తావన తీసుకు రాలేదు కానీ.. ఆయన ఉద్దేశం మాత్రం రఘురామపై వేటు వేయడమేనని సులువుగా అర్థం చేసుకోవచ్చు. అయితే రఘురామకృష్ణరాజు పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదన్న సంగతిని విజయసాయిరెడ్డి మర్చిపోతున్నారు. ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. కనీసం తన కుటుంబసభ్యులకు కూడా వేరే పార్టీ కండువా కప్పించలేదు. సొంత పార్టీపై మాత్రం ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరికి వైసీపీ జారీ చేసే విప్ కూడా ఉల్లంఘించలేదు.
ఒక వేళ రాజ్యాంగ సవరణ చేసినా రఘురామపై అనర్హతా వేటు కష్టమేనని నిపుణులు ఇప్పటికే తేల్చేశారు. అయినా విజయసాయిరెడ్డి మాత్రం తన ప్రయత్నాలు తానుచేస్తున్నారు. ఇదే లేఖలో మొహమాటానికన్నట్లుగా కర్నూలుకు న్యాయరాజధానిని తరలించాలని మూడో అంశంగా కోరారు. అలాగే కర్నూలులోమరో రెండు జాతీయ స్థాయి న్యాయసంస్థలు కూడా పెట్టాలని కోరారు. ప్రథమ ప్రాధాన్యంగా పార్టీ ఫిరాయింపుల చట్ట సవరణ విజ్ఞప్తి చేశారు. రఘురామపై అనర్హతా వేటు వేయించకపోతే.. జగన్మోహన్ రెడ్డి ఎక్కజ తనపై ఆగ్రహం చెందుతారో అన్న ఆందోళనతో విజయసాయిరెడ్డి ఉన్నట్లుగా వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకే ఆయన ఊహాజనితమైన ప్రయత్నాలన్నీ చేస్తున్నారని అంటున్నారు.