నేడో రేపో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలింపు అంటూ వైసీపీ నేతలు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచారం వెనుక మతలబు ఏమిటో తేలిపోయింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలింపు అంటే ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం కాదు… వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసును విశాఖకు తరలించడం. ప్రస్తుతం తాడేపల్లిలోని ఓ అద్దాల మేడలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని రెండు రోజుల్లో విశాఖకు తరలించబోతున్నారు. విశాఖలో ఓ భారీ ఆధునాతమైన భవనాన్ని కార్యాలయం కోసం చూసుకుని ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు రోజుల్లో ప్రారంభించబోతున్నారు. ఇకపై పార్టీ వ్యవహారాలన్నీ విశాఖ కేంద్రంగానే నిర్వహించాలని ఆ పార్టీ పెద్దలు నిర్ణయించుకున్నారు.
వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రారంభించినప్పుడు జూబ్లిహిల్స్‌లో ని ఓ భవనంలో ఉండేది. తర్వాత పార్టీ ఓడిపోవడంతో అద్దె కట్టడం కష్టమన్నఉద్దేశంతో సీఎం జగన్ నివాసం అయిన లోటస్‌పాండ్‌నే పార్టీ కార్యాలయంగా ప్రకటించారు. ఆ మేరకు ఆ అడ్రస్‌తోనే పార్టీ వ్యవహారాలు నడిచేవి. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కార్యాలయం ఉండాలన్న ఉద్దేశంతో తాడేపల్లిలో నాలుగంతస్తుల భవనాన్నితీసుకుని భారీ ఖర్చుతో ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కడే పార్టీ నాయకులంతా మీడియాతో మాట్లాడుతూ ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి దాదాపుగా ప్రతీరోజు ప్రెస్మీట్లో మాట్లాడేది అక్కడి నుంచే. పార్టీ వ్యవహారాలను ఆయనే చూసుకుంటున్నారు.
అయితే తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన విశాఖకు ఇంత వరకూ పార్టీ కార్యాలయాన్నితరలించకపోవడంతో … విశాఖపై వైసీపీకి కూడా నమ్మకం లేదన్న అభిప్రాయం పెరిగిపోతుందన్నఉద్దేశంతో కేంద్ర కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని నిర్ణయించారు. అయితే కార్యాలయాన్ని తరలించినంత మాత్రాన అక్కడ నుంచి కార్యకలాపాలేవీ సాగవని.. ప్రధానంగా తాడేపల్లి నుంచే జరుగుతాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. కీలకమైన నేతలు ఎక్కడ ఉంటే అదే పార్టీ ఆఫీస్ అవుతుంది కానీ అడ్రస్ మార్చినంత మాత్రాన కాదని అంటున్నారు. అయితే ఎవరేమైనా అనుకోనీ.. వైసీపీ కేంద్ర కార్యాయం మాత్రం విశాఖకు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.