బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ప్రకాశం జిల్లాలో ఓ సీఐని బెదిరించిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రైవేటుగా సంగతి చూస్తానని ఆయన నేరుగా సీఐనే హెచ్చరిస్తున్నారు. ఈ ఆడియో తనదేనని ఆయన అంగీకరించారు కూడా. తన సాయం కోరి వచ్చిన దళితులకు అండగా ఉన్నానని ఆయన చెబుతున్నారు. ఈ అంశం ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశమవుతోంది. అలాగే పోలీసు వర్గాల్లోనూ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సీఐ స్థాయి అధికారి… ఎలాంటి బిల్లులు లేకుండా గ్రానైట్ తరలించుకుపోతున్న లారీలను ప్రాణాలు ఒడ్డి పట్టుకుంటే ఎంపీ అంతగా దుర్భాషలు ఆడితే కనీసం .. ఆ సీఐకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడిందా అన్న చర్చ ఆ శాఖలో జరుగుతోంది. ప్రైవేటుగానే సంగతి చూస్తానని నందిగం సురేష్ హెచ్చరించడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. పోలీసులు అంటే అంత చులకన అయిపోయారా అన్న అభిప్రాయం కలగడానికి కారణం అవుతోంది.
బిల్లులు లేవని సీఐ చాలా స్పష్టంగా చెబుతున్నా… విడిచి పెట్టాల్సిందేనని నందిగం సురేష్ హెచ్చరిస్తున్నారు. ఏపీలో గ్రానైట్ మైనింగ్ మాఫియాపై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. వాటి వెనుక ప్రజాప్రతినిధులు ఉన్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. పోలీసులు చూసీ చూడనట్లుగా ఉంటూండటంతో మరింతగా పేట్రేగిపోతున్నారు. ఎక్కడైనా పోలీసులు కాస్త సిన్సియర్‌గా ఉండాలని ప్రయత్నిస్తే ఇలా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆడియో టేపు బయటకు వచ్చింది కాబట్టి నందిగం సురేష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆయన ఇప్పుడే కాదని.. చాలా కాలంగాఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయితే ఆయన వైసీపీ హైకమాండ్‌కు అత్యంత ఇష్టమైన ఎంపీ. అమరావతి రాజధాని గ్రామాలకు చెందిన ఆయన.. వైసీపీ హైకమాండ్ చెప్పినట్లుగా చేస్తారు. ఈ కారణంగా ఆయన ఏం చేసినా వారు సమర్థిస్తూనే ఉంటారు .
చివరికి న్యాయమూర్తులపై అసాధారణ వ్యాఖ్యలు చేయమన్నా ఆయన చేస్తారు. అందుకే పోలీసులపైనా ఆయన నోరు పారేసుకుంటున్నారు., బెదిరిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు ఎవరైనా పోలీసులపై ఇలాంటి మాటలు ప్రయోగిస్తే ఈ పాటికి వారిపై కనీసం పది సెక్షన్ల కింద కేసులు పెట్టి… అరెస్ట్ చేసి ఉండేవారు. కానీ ఇప్పుడు అధికార పార్టీ ఎంపీ కాబట్టి… పోలీసులు పడక తప్పడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.