పార్లమెంట్లో ప్రజాస్వామ్య హత్య జరిగిందని ప్రతిపక్షానికి చెందిన కీలక నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యసభలో ప్రతిపక్షానికి సంబంధించిన ఎంపీలపై భౌతిక దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. కానీ పార్టీలే సభను అడ్డుకున్నాయని… రాజ్యసభలో దారుణంగా ప్రవర్తించారని ఏడుగురు కేంద్రమంత్రులు ప్రెస్‌మీట్ పెట్టి ఎదురుదాడి దిగారు. ఇక్కడ విషయం ఏమిటంటే రెండు పార్టీలు ‘ప్రజాస్వామ్య హత్య జరిగిందని అంగీకరిస్తున్నాయి. కాకపే చేసింది మేము కాదు మీరే అని ఒకరిపై ఒకరు కారణంగా చూపించుకుంటున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల తీరు చూసిన వారు మత్రం నిజంగానే ప్రజాస్వామ్య హత్య జరిగిందని … రెండు పక్షాలు కలిసి ఆ పని చేశాయని నమ్మాల్సిన పరిస్థితికి వస్తున్నారు.
రాజకీయ కరోనా బారిన పడిన పార్టీలు… పార్లమెంట్ సమావేశాలు వృధా..!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్‌కు రెండురోజుల ముందుగానే ముగిశాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సమావేశాలు జరిపింది లేదు. పెట్టినా అంతంత మాత్రమే. ఈ సారి అయినా ప్రజాసమస్యలు చర్చిస్తారనుకుంటే… పట్టుమని ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగలేదు. పేరుకు 24 రోజుల పాటు కొనసాగినప్పటికీ.. కార్యకలాపాలు నడిచింది మాత్రం లోక్‌సభలో కేవలం 21 గంటల 14 నిమిషాలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అటువంటి ప్రజాస్వామ్యానికి ఆలయం పార్లమెంట్. అక్కడ చర్చలు ఎంత బాగా జరుగుతాయన్నదానిపైనే ప్రజాస్వామ్య బలం ఆధారపడి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తూ అక్కడ చర్చలు జరిగి చాలా కాలం అవుతోంది. కరోనా నియంత్రణలో మోదీ సర్కార్ వైఫల్యం, వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోసం కొన్ని నెలలుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమం, ఎన్నడూ లేని విధంగా రూ.100 దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు …వీటికి తోడు కొత్తగా వెలుగులోకి వచ్చిన ‘పెగాసస్’ వంటి ఎన్నో సమస్యలపై చర్చించడానికి అవకాశం ఉంది. కానీ ఒక్క సమస్యపైనా చర్చ జరగలేదు. రోజూ ప్రారంభమవడం.. వాయిదాపడటం మాత్రమే జరిగింది.
పెగసస్‌పై నిజాలు బయటకు రాకుండా పార్లమెంట్ సమావేశాలు త్యాగం..!
రాజకీయ ప్రాధాన్యత ఉన్న పెగాసస్ నిఘా వ్యవహారంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. కానీ బీజేపీ మాత్రం ససేమిరా అన్నది . ఆ ఒక్కటి తప్ప ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని ప్రకటించింది. కానీ విపక్షాలు ఆ అంశంపై మాత్రమే చర్చించాలని పట్టుబట్టాయి. ప్రభుత్వాలకు మాత్రమే ఇజ్రాయెల్ సంస్థ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోందని… అందుకే ప్రభుత్వమే దోషి అని విపక్షాలు తేలుస్తున్నాయి. దీంతో కేంద్రం ఆ స్పైవేర్‌ను తయారుచేసే ఇజ్రాయెల్ సంస్థతో ఎటువంటి లావాదేవీలు జరపలేదంటూ రక్షణశాఖ సహాయమంత్రితో కేంద్రం ప్రకటన చేయిచింది . దానికి విపక్షాలు సంతృప్తి పడలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగంచడం మాత్రమే కాదు… ప్రత్యర్థుల్ని లొంగ దీసుకోవడానికి వారి వ్యక్తిగత వివరాలు నిఘా ద్వారా సేకరించి బ్లాక్ మెయిల్ చేయడం పౌర స్వేచ్ఛకూ, రాజ్యాంగ నియమాలకూ పరమ విరుద్ధం. పెగసస్‌పై విచారణతు సిద్ధపడకుండా…పార్లమెంట్లో కనీసం చర్చకు కూడా రాకుండా కేంద్రం వెనుకడుగు వేస్తూడటంతో ప్రజల్లో కేంద్రంపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వాలకూ, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే విక్రయిస్తామని ఇప్పటికే తేల్చి చెప్పింది. అదే సమయంలో భారత ప్రభుత్వానికి అమ్మలేదు అని ఎన్ఎస్ఓ చెప్పటం లేదు. అలాగే మేం కొనలేదు అని భారత ప్రభుత్వమూ చెప్పడంత లేదు. ఆ సంస్థతో లావాదేవీలు లేవని మాత్రమే చెబుతోంది.
వెంకయ్య కంటతడి సరే…మరి ప్రజాస్వామ్య దుస్థితికి కారణం ఎవరు..?
ఓబీసీ బిల్లు అన్ని రాజకీయ పార్టీలకు .. ఓటు బ్యాంకుతో ముడపిడినది అందుకే… అందరూ చర్చించారు. ఏకగ్రీవంగా ఆమోదింపచేసుకున్నారు. కానీ ఇతర బిల్లుల విషయంలో ఈ క్లారిటీ లేదు. మూడు వారాల సమావేశాల్లో ఒకే ఒక ఓబీసీ బిల్లు మీద ఉభయ పక్షాలు చర్చలు జరిపి ఆమోదించడం మాత్రమే ఘనత. సభ జరగని ప్రతిష్టంభనలోనూ ప్రభుత్వానికి కావాల్సిన బిల్లులు మాత్రం ఏ చర్చా లేకుండానే ఆమోదింప చేసుకున్నారు. సందట్లో సడేమియాలాగా ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రయివేటుపరం చేసే బీమా బిల్లును కూడా ఆమోదించేసుకున్నారు. రాజ్యసభలో చివరి రోజు వ్యవసాయ చట్టాలపై జరిగినరచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును లోక్సభలోపాస్ చేసినప్పుడు ఎలాంటి దుర్భరమైన పరిస్థితులు కనిపించాయో… రాజ్యసభలో మొన్న అవే కనిపించాయి. సభ్యులు బల్లలపైకిఎక్కారు. రాజ్యసభ చైర్మన్ పైకి ఫైళ్లు విసిరేశారు. ఈ పరిణామాలతో వెంకయ్యనాయుడు కూడా కంటనీరు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం.. విపక్షాలపై ఎదురుదాడికి దిగుతోంది కానీ… పరిస్థితి ఇలా ఎందుకు మారిందన్న ఆలోచన మాత్రం చేయడం లేదు. విపక్షం కూడా సంయమనం పాటించడం లేదు. ఫలితంగా ప్రజాస్వామ్యంలో అత్యున్నత వ్యవస్థ అయిన పార్లమెంటరీ వ్యవస్థ పనితీరు దాదాపుగా స్తంభించిపోయింది. అక్కడ చర్చలు జరిగితే పరిష్కారమయ్యే ప్రజాసమస్యలు ఎన్నో ఉన్నాయి. అక్కడ చర్చలు జరిగితే బయటపడిన అవినీతి కేసులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ బయటపడకూడదని అుకుంటున్నారేమో కానీ… ప్రభుత్వం చర్చలకు సిద్ధపడటం లేదు. ప్రతిపక్షం పట్టు వీడటం లేదు.
ప్రజలు చైతన్యవంతులయితేనే పరిస్థితుల్లో మార్పు…!
భారత ప్రజాస్వామ్యంలో పదేళ్ల కిందటి వరకూ ఎలాంటి బిల్లుపై అయినా చర్చ సాగేది. సభ్యులందరూ బిల్లులను చదువుకుని సభకు వచ్చి చర్చలో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు చర్చలకు ఆసక్తి లేదు. దీంతో బిల్లులపై సభ్యులకు కూడా అవగాహన ఉండటం లేదు. ఈ పరిస్థితి భారత ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరమే. అందుకే… అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి..ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నాయనే అభిప్రాయం ఏర్పడుతోంది. దానికి కారణం మీరంటే మీరు అని వాదులాడుకుని ప్రజల్ని కూడా అసలు సమస్య వైపు కాకుండా రాజకీయం వైపు చూసేలా చేస్తున్నాయి. ప్రజలు ఈ రాజకీయ నాటకాల్ని గుర్తించనంత కాలం వారు అలా వేషాలు వేస్తూనే ఉంటారు. ప్రజాస్వామ్య పునాదులు బలహీనమవుతూనే ఉంటాయి.