కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనూహ్యంగా ఏపీ టూర్‌కి వచ్చారు. ఆయన పర్యటన పూర్తిగా వ్యక్తిగతమే అయినప్పటికీ ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి. ముఖ్యమంత్రి జగన్ మాటల్లో చెప్పాలంటే దేశంలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తుల్లో రెండోవారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రధానితో సమస్యలు చెప్పుకోవడం కన్నా అమిత్‌షాతో చెప్పుకోవడం వల్ల ఎక్కువ సమస్యలు పరిష్కారమవుతాయని సీఎం జగన్ భావిస్తారు. అందుకే అమిత్ షాతో అపాయింట్మెంట్ కోసం తరచూ ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి అమిత్ షా రాష్ట్రానికి వస్తే మాత్రం ప్రభుత్వ పరంగా పెద్దగా హడావుడి కనిపించలేదు. ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానం పలకడానికి వెళ్లలేదు.
సీఎం హోదాలో వెళ్లడానికి ప్రోటోకాల్ సమస్య ఉందని అనుకున్నా… ఢిల్లీకి వెళ్లి పడిగాపులు పడటం కన్నా రాష్ట్రానికి వచ్చిన అమిత్ షాను కలిసి కష్టాలు చెప్పుకోవడం సులువుగా ఉండేదన్న అభిప్రాయం ఉండేది. అయితే ముఖ్యమంత్రి జగన్ వెళ్లలేదు. అలాగని ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఆయనకు ఎలాంటి వినతి పత్రాలు అందించే ప్రయత్నం చేయలేదు. ప్రోటోకాల్ ప్రకారం… కొంత మంది అధికారులు.. కర్నూలు ఎంపీ మాత్రమే అమిత్ షాకు స్వాగతం పలికారు. దేశంలో రెండో అత్యంత పవర్ఫుల్ వ్యక్తిగా భావించే షా వస్తే ఏపీ ప్రభుత్వం ఎందుకింత నిరాసక్తత ప్రదర్శించిందో… రాజకీయపార్టీలకూ అంతుబట్టని పరిస్థితి ఉంది. కొన్నాళ్ల కిందట .. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ తిరుపతికి వచ్చినా పట్టించుకోలేదు.
అదే సమయంలో తెలంగాణ వెళ్లిన ఆయనకు అక్కడ ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. దీనిపై రకరకాల విశ్లేషణలు వచ్చాయి. తాజాగా అమిత్ షానూ పట్టించుకోకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇటీవల ఏపీ విజ్ఞప్తులను కేంద్రం పెద్దగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ఉంది. ఈ కారణంగానే అమిత్ షా టూర్ విషయంలో ఖచ్చితంగా ప్రోటోకాల్ ఫాలో అయ్యారు కానీ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని అంటున్నారు.