ఈకాలంలో దేన్నీ కంట్రోల్ చేయలేకపోతున్నాం. సోషల్ మీడియా పుణ్యమా అని – లీకులు ఎక్కువైపోయాయి. సినిమాకి సంబంధించిన అంశాలైతే మరీనూ. చిత్రబృందం చెప్పక ముందే టైటిళ్లు తెలిసిపోతున్నాయి. కథలు బయటకు వచ్చేస్తున్నాయి. కాంబినేషన్లా… సరేసరి. ఇవన్నీ ఎందుకు..? ఏకంగా సినిమాలో సన్నివేశాలే లీకైపోతున్నాయి. `అత్తారింటికి దారేది` ఎపిసోడ్ మర్చిపోయేదేం కాదు. ఏకంగా సగం సినిమా హెచ్ డీ ప్రింట్ తో లీకైపోయింది. ఈ ఎఫెక్ట్ తో అందరూ జాగ్రత్త పడ్డారు. సెట్లో కఠినమైన నిబంధనల్ని అమలు చేసి, లీకు వీరుల్ని కంట్రోల్ చేయగలిగారు. అదంతా కొంత కాలమే. ఇప్పుడు లీకుల సీజన్ మళ్లీ మొదలైనట్టు అనిపిస్తోంది.
మొన్న.. `సర్కారు వారి పాట` టీజర్ నే తీసుకోండి. మహేష్ పుట్టిన రోజున ఉదయం 9 గంటలకు విడుదల కావాల్సిన టీజర్. అర్థరాత్రి హడావుడిగా రిలీజ్ చేశారు. ఎందుకంటే.. ఆ టీజర్ ముందే బయటకు వచ్చేసింది. దాంతో చిత్రబృందం అప్రమత్తమై డామేజ్ కంట్రోల్ చేయడంలో భాగంగా ఆ పని చేసింది. ఇప్పుడు `పుష్ష` వంతు వచ్చింది. ఈ సినిమాలోని తొలి పాటని ఈరోజు (ఆగస్టు 13)న విడుదల చేయాలి. అయితే.. అనుకోకుండా… ఒక రోజు ముందే ఈ పాట బయటకు వచ్చేసింది. దేవిశ్రీ ప్రసాద్ టోన్ లో ఈ పాటని ఇప్పటికే చాలామంది వినేశారు. ఇదీ లీకు వీరుల పనే. పోస్టర్లు, లుక్కుల వరకూ లీకైనా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. టీజర్లూ, పాటలూ ముందే వచ్చేస్తున్నాయంటే ఒకసారి ఆలోచించుకోవాల్సిందే. ఈ సీజన్లో చాలా పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్, ఆచార్య, అఖండ, రాధే శ్యామ్.. ఇలా ఆ లిస్టు చాలా పెద్దదే ఉంది. ఈ సినిమాలకూ ఇలాంటి పరిస్థితే ఎదురు అయితే… `అధికారిక విడుదల` అనే పేరుకి అర్థమే లేకుండా పోతుంది. కొంతమంది కావాలని లీక్ చేసి, తమ సినిమాలకు హైప్ తీసుకొద్దామని చూస్తుంటారు. కాకపోతే.. పెద్ద సినిమాలకు ఆ అవసరం ఉండదు. లీకు వీరుల్ని ఎవరో కనిపెట్టి, వాళ్లకు చెక్ పెట్టాల్సిన బాధ్యత పెద్ద సినిమాలపై ఉంది. తస్మాత్ జాగ్రత్త.