విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై కూడా సీబీఐకి ఎలాంటి అభిప్రాయమూ లేకుండా పోయింది. కోర్టు మెరిట్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని అఫిడవిట్ దాఖలు చేసింది. గత విచారణ సందర్భంగా మరింత సమయం కావాలని అడిగిన సీబీఐ.. ఈ వాయిదాలో విచారణలో మెరిట్ ప్రకారం బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. దీంతో తదుపరి విచారణ పదహారో తేదీకి వాయిదా పడింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విషయంలోనూ సీబీఐ కోర్టు ఇదే చెప్పింది. అయితే చాలా వాయిదాల తర్వాత సీబీఐ ఈ విషయం చెప్పడంతో విమర్శలు వచ్చాయి.
విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం సీబీఐ ఒక్క వాయిదా కోరి అదే విషయాన్ని చెప్పింది. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై విజయసాయిరెడ్డికి కూడా సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. దానిపై ఆయన అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ సారి విచారణలో విజయసాయిరెడ్డి అఫిడవిట్ దాఖలు చేస్తే వెంటనే విచారణ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత బెయిల్ రద్దు చేయాలా లేదా అన్నదానిపై కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై ఇప్పటికే విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్ అయింది. 25వ తేదీన సీబీఐ కోర్టు నిర్ణయాన్ని ప్రకటించనుంది.
పదహారో తేదీన విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై వాదనలు పూర్తయితే.. .. రెండు తీర్పులు ఒకే సారి వచ్చే అవకాశం ఉందని రఘురామరాజు తరపు లాయర్లు అంచనా వేస్తున్నారు. కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ నేతలు కూడా బెయిల్ రద్దు అవుతుందని విమర్శలు చేస్తున్నారు. మీకెలా తెలుసని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు ప్రశ్నిస్తున్నారు.