తన సినిమాలతో కంటే, తన కామెంట్లతోనే ఎక్కువ పాపులర్ అయ్యాడు విశ్వక్ సేన్. మొన్నటికి మొన్న `పాగల్` ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విశ్వక్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాడు. `ఈ సినిమా ఆడకపోతే నా పేరు మార్చుకుంటా` అంటూ తన కాన్ఫిడెన్స్ ప్రకటించేశాడు. `బాహుబలి టైమ్ లో ప్రభాస్ కూడా ఇలా మాట్లాడలేదు` అంటూ విశ్వక్ పై సెటైర్లు వేసుకుంటున్నారు జనాలు. రేపు (ఆగస్టు 14) పాగల్ విడుదల అవుతోంది. ఈ సినిమా ఒక్క రోజు ముందు తన టోన్ మార్చాడు విశ్వక్. మరీ ఎక్కువగా మాట్లాడితే – ఆ తరవాత జనాలు తనని విపరీతంగా మోసేస్తారని తెలుసు. అందుకే కాస్త తగ్గినట్టు అనిపించాడు. ఈరోజు ప్రింట్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చాడు విశ్వక్. ఈ సందర్భంగా రివ్యూల ప్రస్తావన వచ్చింది.
”ఫలక్ నామా దాస్, ఈ నగరానికి ఏమైంది.. ఇవి రెండూ మంచి సినిమాలే. కానీ.. రివ్యూలు చాలా తేడాగా వచ్చాయి. అదేంటో నా సినిమాలంటే రివ్యూ రైటర్లు మోసేస్తుంటారు. ఈసారి నన్ను మరీ అంత మోయకండి.. పర్సనల్ ఎజెండాతో రివ్యూలు రాయకుండి. ఎవరికీ లేని ఈ సమస్య నాకే ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు“ అని వాపోతున్నాడు విశ్వక్. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తాను చేసిన కామెంట్లకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నా అంటున్నాడు. “నాకు సినిమాపై విపరీతమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకమే నన్ను అలా మాట్లాడించేలా చేసింది. ఈమధ్య చాలామందికి `పాగల్` చూపించాను. చూసినవాళ్లంతా ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పినవాళ్లే. ఫస్ట్ షో పడితే నేను కాదు.. నా సినిమానే మాట్లాడుతుంది అనే నమ్మకం ఉంది నాకు నాకు ముందు నుంచీ ఎవరి సపోర్ట్ లేదు. నాకు గాడ్ ఫాదర్ లేడు. నా కాళ్లపై నేను నిలబడడానికి ప్రయత్నిస్తున్నా” అని చెప్పుకొచ్చాడు విశ్వక్.