ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులకు సోషల్ మీడియా పోస్టుల కేసులతోనే సరిపోతోంది, ఎవరో ఒకరు వైసీపీ పైన.. సీఎంపైన.. ఆయన కుటుంబంపైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. వాటిపై ఫిర్యాదులు తీసుకుని నిందితుల్ని అరెస్ట్ చేయడం… రోజువారీ పనిగా మారిపోయింది. తాజాగా ముఖ్యమంత్రి జగన్ కుమార్తెపై అసత్య ప్రచారం చేస్తున్నారని కడప జిల్లాకు చెందిన భూమిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకు వచ్చారు. ఆయనను చాలా సేపు విచారించి ఫోన్ స్వాధీనం చేసుకుని విడిచి పెట్టారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ కుమార్తెపై అసత్య ప్రచారం చేస్తున్నారని సీఐడీ పోలీసులు కేసు పెట్టారు. ఈ భూమిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నేత. ఆయన రెండేళ్ల కిందట వరకూ వైసీపీలోనే ఉన్నారు ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు వైసీపీ అధినేత కుటుంబపై పోస్టులు పెట్టారని అరెస్టయ్యారు.
ఒక్క భూమిరెడ్డి మాత్రమే కాదు.. ఇటీవలి కాలంలో పలువురు టీడీపీ కార్యకర్తల్ని కూడా సీఐడీ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అసలు ఎవరి పేరు లేకుండా ఉన్న కొన్ని రూమర్లకు చెందిన పోస్టుల్ని షేర్ చేశారని తెనాలికి చెందిన ఓ యువతిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి.. రాత్రంతా స్టేషన్‌లో ఉంచారు. విడిచిపెట్టిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో చెడామడా తిట్టారు. మరో వృద్ధ దంపతులపైనా అలాగే కేసులు పెట్టి తీసుకొచ్చారు. ఓ వైపు సుప్రీంకోర్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని అరెస్టులు చేయకూడదని స్పష్టమైన తీర్పులు ఇచ్చినప్పటికీ సీఐడీ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి జగన్.. వైసీపీ పార్టీపై ఎవైనా వ్యతిరేక పోస్టులు పెడితే వెంటనే వాలిపోతున్నారు. అదేసమయంలో ఇతరులు తమ గౌరవానికి భంగం కలిగేలా వైసీపీ నేతలు పోస్టులు పెడుతున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్పందించడం లేదు.
టీడీపీ మహిళా నేతలు గౌతు శిరీష్, ఆదిరెడ్డి భవానీలు ఈ అంశంపై ఫిర్యాదులు చేసినా ఇంత వరకూ ఉలుకూ పలుకూ లేదు. అయితే కొసమెరుపేమిటంటే… వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన ఫేక్ ఆడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేసి పరువు తీస్తున్నారని బహిరంగంగా చెబుతున్నా సీఐడీ పోలీసులు పట్టించుకోలేదు. మామూలుగాఅయితే అది ఫేక్ అయితే సీఐడీ ఈ పాటికి అరెస్టులు చేసి ముసుగులు వేసి మీడియా ముందుప్రవేశ పెట్టి ఉండేవారే. కొంత మందిని అరెస్ట్ చేస్తే ఇతరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టడం మానేస్తారని సీఐడీ అధికారులు భావిస్తున్నారనే విమర్శలు రాజకీయ పార్టీల నుంచి వస్తున్నాయి.