`ఆలసించిన… ఆశాభంగం..` అన్నట్టు త్వరపడుతోంది టాలీవుడ్. సెకండ్ వేవ్ తరవాత.. మెల్లగా థియేటర్లు తెరచుకున్నాయి. ఒకొక్కరుగా.. థియేటర్లకు వస్తున్నారు జనాలు. త్వరలో పెద్ద సినిమాల జాతర ఉంది. అందుకే… `ఇంతకు మించిన తరుణం దొరకదు` అన్నట్టు చిన్న సినిమాలు జోరుగా విడుదల అవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకూ దాదాపు 18 సినిమాలు విడుదల అయ్యాయి. ఈ శుక్రవారం మరో 5 చిత్రాలు రిలీజ్‌కి రెడీ అయిపోయాయి. శ్రీవిష్ఱు `రాజరాజ చోర` సునీల్ `కనబడుట లేదు`తో పాటుగా… క్రేజీ అంకుల్స్, బజార్ రౌడీ, చేరువైనా.. దూరమైనా ఈ వారమే వస్తున్నాయి.
అయితే ఈ 5 సినిమాల్లోనూ క్రేజ్ ఉన్నది.. `రాజ రాజ చోర`నే. క్రైమ్ కామెడీ జోనర్లో సాగే సినిమా ఇది. ప్రచార చిత్రాలు మంచి స్పందన వచ్చింది. `బ్రోచేవారెవరురా` తరవాత.. శ్రీవిష్ణు మళ్లీ ఈ జోనర్ ట్రై చేయలేదు. కాబట్టి.. కచ్చితంగా ఏదో విషయం ఉండే ఉంటుందన్న నమ్మకం కలుగుతోంది. సునీల్ `కనబడుటలేదు` ట్రైలర్ సైతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రైవేట్ డిటెక్టీవ్‌గా సునీల్ కనిపించిన సినిమా ఇది. ఈ తరహా కథలకు మంచి గిరాకీ ఉంది. మరి సునీల్ ఏం చేస్తాడో చూడాలి.