దళిత అధికారులు ప్రభుత్వంలో.. సీఎంవోలో ఉన్నతాధికారులుగా పనికి రారా..? అంటూ కొద్ది రోజులుగా తెలంగాణ అధికార, రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి కారణం చీఫ్ మినిస్టర్ ఆఫీస్.. సీఎంవోలో ఇంత వరకూ ఒక్క దళిత అధికారిని కూడా కీలక పోస్టులో నియమించలేదు. గతంలో కొంత మంది టీఆర్ఎస్ నేతలు దళిత అధికారులకు ఏమీ తెలియదని.. చెప్పిన పనులు కూడా చేయరని ఈసడించిన సందర్భాలు ఉన్నాయి. ఈటల రాజేందర్ కూడా పలు సందర్భాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో హుజురూబాద్లో కేసీఆర్ ఈ విమర్శలకు సమాధానం ఇచ్చారు.
ఎస్సీ సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జాను సీఎంవోలో సెక్రటరీగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ బొజ్జా దళితుడేనని… ఉద్యమంలో పని చేసిన వారికి రాహుల్ బొజ్జా తండ్రి. బొజ్జా తారకం న్యాయవాదిగా సేవలు అందించారని చెప్పారు. ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీగా మాత్రమేకాదు.. సీఎంవోలోనూ ఉంటారని ఆయన ఆదేశాలన్నీ అమలు కావాలని కేసీఆర్ ప్రకటించారు. ఉపఎన్నికల పుణ్యమా అని హుజురాబాద్ దళితులకు మాత్రమే కాదు దళిత అధికారులకు కూడా మహర్దశ పట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్రటరీగా తీసుకున్న కేసీఆర్.. ముందు ముందు మరింత మంది దళిత అధికారులుక కీలక పోస్టులు కేటాయిచే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎందుకు కేటాయించలేదని.. ఇప్పుడే దళిత అధికారులు గుర్తొస్తున్నారా అని విపక్షాలు విమర్శించే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ ఇలాంటి విమర్శల్ని రాజకీయంగా ఎదుర్కోవడంతో రాటుదేలిపోయారు. కౌంటర్ ఇస్తారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.