ఇండియాలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం జగన్మోన్ రెడ్డిని ఏడాదిన్నర క్రితం వరకూ కీర్తించిన ఇండియా టుడే ఇప్పుడు భిన్నమైన ఫలితాలను ప్రకటిస్తోంది. ఇండియాలో బెస్ట్ సీఎం ఎవరు అని “మూడ్ ఆఫ్ ది నేషన్” పోల్ ఆగస్ట్ 2021 లో నిర్వహించగా జగన్మోహన్ రెడ్డి బాగా వెనుక బడి ఉన్నారు
జగన్ పాలనపై 81 శాతానికిపైగా ప్రజలు అసంతృప్తి..!
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే గ్రూప్ పోల్ నిర్వహిస్తూంటుంది. ఇందులో దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రులు ఎవరు అన్నదానిపై నిర్వహించిన పోల్‌లో ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి. ఇటీవలే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్ దేశంలో అందరి కంటే ముందున్నారు. ఆయన అత్యుత్తమ పాలన అందిస్తున్నారని 42 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత స్థానాల్లో నవీన్ పట్నాయక్, పినరయి విజయన్, ఉద్దవ్ ధాకరే, మమతా బెనర్జీ ఉన్నారు. వీరంతా 30 శాతానికిపైగా అప్రూవల్ రేటింగ్ తెచ్చుకున్నారు. 30 నుంచి 19 శాతం మధ్య రేటింగ్ తెచ్చుకున్న వారిలో అస్సాం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, జార్ఖండ్, చత్తీస్ఘడ్ సీఎంలు ఉన్నారు. ముఖ్యమంత్రుల రేటింగ్‌ను ఆయా రాష్ట్రాల్లోని ప్రజల అభిప్రాయాలతోనే ఇచ్చారు. ఇందులో సీఎం జగన్‌కు 19 శాతం కన్నా తక్కువ ఫలితాలు వచ్చాయి. అంటే సీఎం జగన్ పూర్తి స్థాయిలో వెనుకబడిపోయారు. ఏపీ ప్రజలు కోరుకుంటున్న పాలన అందించడంలోఆయన విఫలమయ్యారని ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ద్వారా వెల్లడయినట్లుగా భావింవచ్చు.
ఇండియా లో బెస్ట్ చీఫ్ మినిస్టర్‌గా కేవలం 6 శాతం మాత్రమే జగన్ !
అదే సమయంలో ఇండియా మొత్తం .. దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు ? అన్నదానిపై కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ అభిప్రాయాలు సేకరించింది. అందులో సీఎం జగన్ గత ఏడాది తో పోలిస్తే సగం మంది మాత్రమే మద్దతు ఇచ్చారు. కేవలం ఆరు శాతం మాత్రమే జగన్ బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని అభిప్రాయానికి వచ్చారు.జగన్మోహన్ రెడ్డి బెస్ట్ సి ఎం అని చెప్పిన వారి శాతం దేశం లో గత ఏడాది 11 శాతం ఉంది. పదవి చేపట్టిన కొత్తలో బెస్ట్ చీఫ్ మినిస్టర్‌గా రెండో స్థానం, మూడో స్థానం వచ్చేది. ఆ తర్వాత తగ్గిపోతూ వచ్చింది.
గతంలో ఇండియా టుడే ఫలితాలను గొప్పగా ప్రచారం చేసుకున్న జగన్ మీడియా..!
జగన్మోహన్ రెడ్డి యాభై శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చారు. ఆయనకు నలభై శాతం వరకూ నిఖార్సైన ఓటు బ్యాంక్ ఉంటుంది. ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అద్భుతం అని సమర్థించే ఓటర్లు ఉన్నారు. ఇంత గొప్ప సానుకూలత ఉన్నప్పటికీ.. ఆప్రూవల్ రేటింగ్స్ ప్రతీ ఏటా పడిపోవడం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. సొంత ఓటర్లను కూడా మెప్పించలేని విధంగా జగన్ పాలన రూపాంతరం చెందిందన్న అభిప్రాయం వ్యక్తమవడానికి కారణం అవుతోంది. పైగా ఈ అప్రూవల్ రేటింగ్స్ ప్రకటిస్తున్న సంస్థ ఆయనకు ఏమీ వ్యతిరేకం కాదు. ఆ సంస్థ ప్రకటించిన సర్వేలను .. పోల్స్‌ను జగన్ మీడియా మొదటి పేజీల్లో ప్రచురించుకునేది.
కరోనా వల్ల ప్రధాని మోడీ సహా సీఎంలు అందరికీ ప్రజా వ్యతిరేకతే..!
అయితే ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు.. దేశంలో ముఖ్యమంత్రులందరూ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ వెల్లడించింది. అలాగే ప్రధాని మోడీ రేటింగ్స్ కూడా దారుణంగా పడిపోయాయి. ఆయన 66 శాతం నుంచి 24 శాతానికి వచ్చారు. దీనికి కారణం కరోనా పరిస్థితులే. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా యాభై శాతం ప్రజల ఆదరణను చూరగొనలేకపోయారు. అయితే వీలైనంత ఉత్తమ పనితీరును కనబరిచారు. ఏళ్ల తరబడి సీఎంలుగా ఉంటున్న మమతా బెనర్జీ, పినరయి విజయన్, నవీన్ పట్నాయక్ వంటి వారు ఇప్పటికి ప్రజాభిమానాన్ని అదే విధంగా పొందుతున్నారు. కానీ రెండేళ్ల కిందటే సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్… ప్రజల్లో తన మద్దతును శరవేగంగా పోగొట్టుకున్నారు..