పుష్షని లీకు వీరులు వేధిస్తున్నారు. ఇప్పటికే.. `దాక్కో దాక్కో మేక` పాట ముందే బయటకు వచ్చేసింది. పుష్షలోంచి ఓ కీలకమైన ఫైట్ సీక్వెన్స్ కూడా లీకైంది. ఈ విషయంపై నిర్మాతలు సైబర్ క్రైమ్ ని సైతం సంప్రదించారు. ఇప్పుడు మరో పాట బయటకు వచ్చింది. వల్లీ..వల్లీ అంటూ… కథానాయిక రష్మికపై సాగే పాట ఇది. మెలోడీ బీట్ తో సాగుతుంది. ఈ పాట షూటింగ్ సమయంలో ఎవరో సెల్ ఫోన్ లో రికార్డు చేసి బయటకు వదిలారు. దాంతో.. రెండో పాటకు సంబంధించిన క్లూ కూడా బయటకు వచ్చేసినట్టైంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. కాకపోతే.. ఈ సినిమాలోని కీలకమైన సీక్వెన్సులు కొన్ని బయటకు వచ్చేశాయని చిత్రబృందం అనుమానిస్తోంది.
పుష్ష పెళ్లి ఫైట్ లోని 19 సెకన్ల బిట్ ఈమధ్య లీకైంది. వీఎఫ్ఎక్స్ స్టూడియో నుంచి ఈ లీక్ జరిగిందని నిర్మాతలు తేల్చేశారు. ఆ వీఎఫ్ఎక్స్ సంస్థకే 47 నిమిషాల ఫుటేజీ ఉన్న సినిమాని ఇచ్చారు. వీఎఫ్ఎక్స్ కోసం. ఇప్పుడు ఆ ఫుటేజీ మొత్తం బయటకు వచ్చేసిందా? అంటూ చిత్రబృందం అనుమానిస్తోంది. అందుకే… దీన్ని సైబర్ క్రైమ్ వరకూ తీసుకెళ్లింది. ఓ సహాయ దర్శకుడి నుంచే.. పుష్ష సీన్ బయటకు వచ్చిందని, అతని దగ్గరే 47 నిమిషాల ఫుటేజీ ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే సహాయ దర్శకుడ్ని అదుపులోకి తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు కూపీ లాగుతున్నారు.