ఏదో అనుకుంటే, ఇంకేదో అయ్యిందే… అన్నట్టు తయారైంది ఓ బడా హీరో పరిస్థితి. సినీ ఇండ్రస్ట్రీలో… ఆయన ఓ సీనియర్ హీరో. అడపాదడపా హిట్లు ఇస్తూ.. నిలదొక్కుకుంటూ వస్తున్నాడు. పెద్ద హీరోలకు ధీటుగా తన సినిమాలు కూడా వసూళ్లు సంపాదించేవి. ఆయన నిర్మాత కూడా. `మా` ఎన్నికలలో భాగంగా ఓ వర్గాన్ని ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఫోన్లో..`మా` సభ్యుల్ని పలకరించి.. వాళ్ల సహాయ సహకారాల్ని అర్థించడం ఈమధ్య ఆయన ప్రధానమైన పని అయిపోయింది. అయితే ఈ హీరోకి ఓ అలవాటు ఉంది. ఎవరితో మాట్లాడినా.. ఫోన్ లౌడ్ స్పీకరులో పెడుతుంటాడు. ఆ సంభాషణ అంతా తన చుట్టుపక్కల వాళ్లు వింటూ.. తనకి అవతలి వాళ్లు ఎంత మర్యాద ఇస్తున్నారో, చాటి చెప్పడం ఆ లౌడ్ స్పీకరు ధ్యేయం.
అలా… మొన్నామధ్య ఓ సీరియర్ ఆర్టిస్టుకి ఫోన్ చేశారు. ఆమె సపోర్ట్ అడిగారు. ఆమె కూడా మొహమాటం కొద్దీ.. ఓకే అంది. అయితే… ఫోన్ కాల్ కట్ చేసి, మళ్లీ ఆమెకే ఫోన్ చేసి… అత్యుత్సాహంతో ఓ మాట నోరు జారారట. అంతే.. అవతలి గొంతు స్వరం మార్చింది. `నేను ఎలాంటి దాన్ని అనుకుంటున్నారు. నా జోలికొస్తే మామూలుగా ఉండదు.. మీ ఇంట్లో మీరు గొప్పయితే. నా ఇంట్లో నేను గొప్ప..` అంటూ.. ఓ రేంజ్లో క్లాస్ పీకిందట. వాళ్ల మధ్య ఈ ఫోన్ సంభాషణ దాదాపు 10 నిమిషాలు సాగిందని టాక్. ఫోన్లో బాబుగారికి.. ఆమె ఆడుకోవడం, ఆ సంభాషణంతా.. చుట్టు పక్కల వాళ్లు వినడం జరిగిపోయాయి. ఫోన్ కాల్ కట్ అయ్యేంత లోగా.. బాబు గారి పరువు గంగ పాలైంది.
నిజానికి… ఈయన ఫోన్ చేసింది మరెవరికో కాదు. ప్రత్యర్థి వర్గంలోని కీలకమైన సభ్యురాలికి. ఈమె `మా`లో పోటీ చేస్తున్న మరో కీలకమైన అభ్యర్థికి బాగా కాల్సిన వ్యక్తి అన్న సంగతి.. సదరు హీరోకి తెలియకపోవడం, రెండోసారి కాల్ చేసి, ఓ మాట జారడం.. ఆయన చేసిన తప్పులు. ఓ హీరోని క్యారెక్టర్ ఆర్టిస్టు ఫోన్ లో ఆడుకుందన్న విషయం.. ఇప్పుడు అలా.. అలా బయటకు వచ్చేసింది. ఆ హీరో ఎవరు, ఆ క్యారెక్టర్ ఆర్టిస్టు ఎవరు? అంటూ ఆసక్తిగా జనాలు చర్చించుకుంటున్నారు.