పెగాసస్ నిఘా వ్యవహారంతో రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రం … వాటి నుంచి బయట పడటానికి చివరికి “దేశభద్రత” అనే రక్షణ చట్రాన్ని మరోసారి బయటకు తీసింది. దేశభద్రత కోసం ఉగ్రవాదులపై నిఘా పెట్టడానికి చాలా రకాల సాఫ్ట్వేర్లు వాడుతూంటామనిఅలాంటి విషయాలను బయట పెట్టడానికి దేశ భద్రతకు ప్రమాదమని కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై మరింత అనుమానాలు బలపడతాయి కానీ.. సుప్రీంకోర్టు అయినా ఇలాంటి వాదనలను కేంద్రం వినిపించినప్పుడు… ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వివరాలు బయట పెట్టాల్సిందే అని కానీ.. విచారణ చేయించాల్సిందని కానీ ఆదేశించదు. అందుకే కేంద్రం వ్యూహాత్మకంగా దేశభద్రత అంశాన్ని రక్షణగా ఉపయోగించుకోవడం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
గతంలో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో భారీ స్కాం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పుడు కూడా వివరాలు వెల్లడించడం దేశ భద్రతకు ప్రమాదం అంటూ కేంద్రం సుప్రీంకోర్టులో వాదించింది. ఎంతకు కొన్నారు.. ఒప్పందం ఏమిటి అన్న వివరాలు చెబితేనే దేశభద్రతకు ప్రమాదం అని ఎలా చెబుతారో చాలా మందికి అర్థం కాలేదు. కానీ అలాంటి వాదనతో రాఫెల్లో స్కాం లేదని సుప్రీంకోర్టులో వాదించి తీర్పు తెచ్చుకున్నారు. అయితే రాఫెల్లో చాలా పెద్ద స్కాం జరిగిందని ఫ్రాన్స్‌లో అక్కడి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. కానీ ఇక్కడ మాత్రం దేశభద్రత అనే కారణాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ బయటపడిపోతోంది.
ఇప్పుడు పెగాసస్ వ్యవహారంలోనూ కేంద్రం దేశ రక్షణను తమకు రక్షణగా పెట్టుకుంటోంది. ఉగ్రవాదులపై వాడాల్సిన సాఫ్ట్‌వేర్‌ను రాజకీయ ప్రత్యర్థులపై వాడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచారణకు కేంద్రం ససేమిరా అంటోంది. విచారణ జరపాల్సిందేనని విపక్షాలు పట్టు బడుతున్నాయి. విచారణ జరిపితే ఏం బయటపడుతుందోనన్న ఆందోళనతో కేంద్రం పార్లమెంట్ సమావేశాల్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎదుట పరిశీలనకు కమిటీ నియమిస్తామని చెబుతోంది.. కానీ విచారణ వద్దంటోంది. ఎక్కడ సుప్రీంకోర్టు విచారణకు ఆదేశిస్తుందోనన్న భయంతో దేశ రక్షణ అస్త్రాన్ని తనకు అస్త్రంగా ఉపయోగించుకుంటోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది.