టీడీపీ తరపున గెలిచి వైసీపీలో చేరిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌కు ఆ పార్టీ నేత చంద్రగిరి ఏసురత్నం షాక్ ఇచ్చారు. ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. గిరిధర్ తప్పుడు అఫిడవిట్ వేశారని అనేక విషయాలు గోప్యంగా ఉంచారని..చెప్పిన విషయాలు కూడా అబద్దాలని ఆయన కొన్ని సాక్ష్యాలను సేకరించి హైకోర్టును ఆశ్రయించారు. నిజానికి ఆయన ఈ పిటిషన్ వేసింది మద్దాళి గిరి వైసీపీలో చేరక ముందే. కానీ ఇప్పుడుఆ పిటిషన్ విచారణకు రానుంది. ఎమ్మెల్యే వైసీపీలో చేరినప్పటికీ.. తన పిటిషన్ విషయంలో వెనక్కి తగ్గబోనని వైసీపీ నేత చంద్రగిరి ఏసురత్నం అంటున్నారు. అందుకే ఆయన తన వద్ద ఉన్న అన్ని సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచి .. మద్దాలి గిరిపై అనర్హతా వేటు వేయించేందుకు ప్రయత్నించాలని అనుకుంటున్నారు.
తప్పుడు అఫిడవిట్లు, కేసులను దాచి పెట్టడం వంటి కారణాల వల్ల గతంలో ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేసిన సందర్భాలు ఉన్నాయి. గత టీడీపీ హయాంలో అనంతపురం జిల్లా మడకశిర నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఈరన్న నామినేషన్ పత్రాల్లో కొన్ని వివరాలు తప్పుగా ఇచ్చారని నిర్దారించిన హైకోర్టు ఆ ఎమ్మెల్యేపై అనర్హతా వేటు వేసింది. సుప్రీంకోర్టు కూడా.. సమర్థించింది. దాంతో ఆ ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. రెండో స్థానలో ఉన్న అభ్యర్థి వైసీపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ఖరారు చేశారు. ఆయన ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే సహజంగా ఇలాంటి పిటిషన్ల విచారణ ఏళ్లకేళ్లు సాగుతూనే ఉంటుంది.
ఇప్పటి వరకూ.. ఇలాంటి పిటిషన్లపై పదవి కాలం ముగిసిన తర్వాత తీర్పులొచ్చాయి. కానీ ఈరన్నకు మాత్రం .. కొంత కాలం పదవి కోల్పోక తప్పలేదు. ఈ విషయంలో మద్దాళి గిరికి ఎలాంటి ఫలితం వస్తుందో కానీ.. ఏం జరిగినా వైసీపీలో రచ్చ జరగడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన తనకు ప్రాధాన్యత కల్పించడం లేదని మద్దాళి గిరి అలుగుతున్నట్లుగా గుంటూరులో ప్రచారం జరుగుతోంది.