హుజురాబాద్ కాంగ్రెస్ నేతగా ఉండి టీఆర్ఎస్ టిక్కెట్ తనకేనని ప్రకటించుకుని చివరికి టీఆర్ఎస్లో చేరిపోయిన పాడి కౌశిక్ రెడ్డికి ఇంకా మంచి రోజులు రాలేదు. ఆయనను టిక్కెట్ రేస్ నుంచి తప్పించేందుకు కేసీఆర్ ఎమ్మెల్సీగా పంపాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఖరారు చేసి.. కేబినెట్లో కూడా ఆమోద ముద్ర వేసి గవర్నర్ కార్యాలయానికి పంపారు. ఇప్పటికీ రెండు వారాలు దాటిపోయింది. కానీ గవర్నర్ ఇప్పటి వరకూ ఆ ఫైల్‌పై సంతకం చేయలేదు. దీంతో కౌశిక్ రెడ్డికి ఎదురు చూపులు తప్పడం లేదు.
సాధారణంగా కేబినెట్ ఆమోదించి పంపిన ఎమ్మెల్సీ స్థానాల భర్తీ ని గవర్నర్ ఆమోదించకుండా ఉండరు. వెంటనే ఆమోదిస్తారు. ఎందుకంటే ఆ స్థానం ఇప్పటికే ఖాళీ అయి ఉంటుంది. ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా గవర్నర్‌కు ఆ పేర్లు నచ్చలేదని భావించాల్సి ఉంటుంది. కొద్ది రోజుల కింద ఏపీ ప్రభుత్వం అలా గవర్నర్ కోటాలో భర్తీ చేసిన ఎమ్మెల్సీ స్థానాలపై అభ్యంతరాలు ఉన్నాయన్న ప్రచారం జరగడంతో మూడు రోజుల పాటు ఆమోద ముద్రవేయలేదు. నేరుగా సీఎం జగన్ గవర్నర్‌ను కలిసిన తర్వాత ఫైల్‌పై ఆమోదముద్రపడింది. ఇక్కడ రెండు వారాల పాటు దాటిపోయినా సీఎం కేసీఆర్ కూడా పట్టించుకోవడం లేదు.
తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి ఫాలో అప్ లేకపోవడంతో ఆ ఫైల్ విషయంలో గవర్నర్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాడి కౌశిక్ రెడ్డిపై పలు రకాల కేసులు ఉన్నాయి. అందులో ఎన్నికల కేసులే కాక ఇతర కేసులు కూడా ఉన్నాయి. ఈ కారణంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయన పేరును ఖరారు చేసేందుకు వెనుకా ముందాడుతున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. అయితే కేసీఆర్ ఒక మాట చెబితే గవర్నర్ సంతృప్తి చెందుతారని… వెంటనే ఆమోదిస్తారని కానీ ఎందుకో ఆయన కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరో వైపు ఎమ్మెల్యే సీటు రాకపోతే పోయింది.. ఎమ్మెల్సీ పదవి వచ్చిందని.. ప్రమాణస్వీకారం రోజు ధూం..ధాం చేద్దామనుకుని ఏర్పాటు చేసుకున్న కౌశిక్ రెడ్డికి ఎదురు చూపులు ఎప్పుడు ఫలిస్తాయో అర్థం కాకుండా ఉంది.