అక్రమాస్తుల కేసుల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో కేసు కలిసింది. క్విడ్ ప్రో కో లావాదేవీల ద్వారా పెద్ద ఎత్తున అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడ్డారన్న కారణంగా వాన్‌పిక్ వ్యవహారంలో ఈడీ కోర్టు సెప్టెంబర్ 22న హాజరు కావాలని ఆదేశించింది. రెండు రోజుల కిందట వాన్‌పిక్‌తో పాటు లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో ఈడీ చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిని కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితులందరికీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులోనూ ఏ వన్‌గా జగన్, ఏ టూగా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇతర నిందితులుగా మోపిదేవి, ధర్మానతో పాటు నిమ్మగడ్డ ప్రసాద్ పలువురు సివిల్ సర్వీస్ అధికారులు ఉన్నారు. వీరందరూ సెప్టెంబర్ 22న కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.
జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ దూకుడు మీద ఉంది. ఇటీవల సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ వాన్ పిక్ ప్రాజెక్టును చేపట్టారు. రస్ అల్ ఖైమా తో కలిసి నిమ్మగడ్డ ప్రసాద్ జాయింట్ వెంచర్ గా ప్రారంభించారు. దీనికి అప్పటి ప్రభుత్వం 24 వేల ఎకరాలు కేటాయించింది. అయితే ఈ కేటాయింపుల వెనుక క్విడ్ ప్రో కో ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ కేటాయింపుల తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లోకి రూ. 850 కోట్లను.. నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ సంస్థల్లోకి పెట్టుబడులుగా పెట్టారు. భూముల్ని కేటాయించినందుకు గాన క్విడ్ ప్రో కో తరహాలో జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. వీటిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కూడా కేసులు నమోదు చేసి చార్జిషీట్లు దాఖలు చేసింది.