సీబీఐని రాజకీయ పంజరం నుంచి వదిలి పెట్టాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు దేశవ్యాప్త సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఆదేశాలను ధర్మాసనం ఆషామాషీగా చేయలేదు. సీబీఐని పటిష్ట పరిచేందుకు మొత్తం 12 సూచనలను ధర్మాసనం చేసింది. కాగ్, ఎన్నికల కమిషన్ తరహాలో స్వతంత్ర ప్రతిపత్తి సీబీఐకి కల్పించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ డైరక్టర్‌కి ప్రభుత్వ కార్యదర్శితో సమానమైన అధికారంతో పాటు అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, యూకేలోని స్కాట్లాండ్ యార్డ్ వంటి వ్యవస్థలతో సమానంగా ఆధునిక సదుపాయాలు కల్పించాలని కూడా ఆదేశించింది.
ఓ చిట్ ఫండ్ స్కాంను సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న దాఖలైన పిల్‌పై మద్రాస్ హైకోర్టు ముధురై బెంచ్ ధర్మాసనం విచారణ జరిపింది. సీబీఐకి చాలా పరిమితమైన మ్యాన్ పవర్.. వనరులు ఉన్నాయని ఇలా అన్ని కేసులను సీబీఐకి అప్పగిస్తూ పోతే దర్యాప్తు చేయలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనేసీబీఐ స్వరూప స్వభావాలను మార్చడానికి మొత్తం పన్నెండు సూచలను తీర్పులో న్యాయమూర్తులు చేశారు. ఆరు వారాల్లోగా కేంద్రానికి ప్రతిపాదన పంపాలని సీబీఐ చీఫ్‌ని కోర్టు ఆదేశించింది. ప్రతిపాదన అందిన మూడు నెలల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
మద్రాస్ హైకోర్టు ఆదేశించినంత మాత్రాన కేంద్రం ఆ పని చేస్తుందా అంటే.. చెప్పడం కష్టమే. సీబీఐ అనేది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు మిత్రపక్షం. రాజకీయప్రత్యర్థుల వేటకు ఉపయోగడే అతి పెద్ద అస్త్రం. ఎవరు అధికారలో ఉన్నా సీబీఐని వాడే విధానం వేరుగా ఉంటుంది. అందుకే కాంగ్రెస్ టైంలోనే సుప్రీంకోర్టు పంజరంలో చిలుకగా సీబీఐని అభివర్ణించింది. సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని.. ఆధునిక సౌకర్యాలు సమకూర్చాలనే డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలు తల్చుకుంటేనే అది సాధ్యం. అధికారంలో ఉన్న పార్టీ సీబీఐ ద్వారా లబ్ది పొందాలని అనుకుంటుంది కానీ… స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడానికి అంగీకరించలేదు. అదే పార్టీ ప్రతిపక్షంలోకి మారితే.. స్వతంత్ర ప్రతిపత్తికి ఆ పార్టీనే ఉద్యమం చేస్తుంది. ఇలాంటి రాజకీయ లోపాల వల్లే దేశంలో వ్యవస్థలు పనికి రాకుండా పోతున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.