విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని ఉద్యోగ సంఘాలన్నీ పోరుబాట పడుతూంటే తాము కూడా కొనుగోలు రేసులో ఉన్నామని హఠాత్తుగా టాటా స్టీల్ ప్రకటన చేసింది. ఆ సంస్థ సీఈవో ఈ ప్రకటన చేశారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ఇదంతా కేంద్ర ప్రభుత్వ కుట్ర అని ఆరోపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పోస్కో సంస్థకు కట్టబెట్టేందుకే కేంద్రం అన్ని రకాల వేషాలు వేస్తోందని ఉద్యోగులు నమ్ముతున్నారు. అలా కట్టబెడితే.. చివరికి ప్లాంట్ ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంటుందని వారి ఆందోళన. దీన్ని కనిపెట్టారో… ఉద్యోగుల ఆందోళన తగ్గించాలనుకున్నారో కానీ… హఠాత్తుగా టాటా స్టీల్ రేసులోకి వచ్చింది.
తాము కూడా విశాఖ ప్లాంట్‌ను కొనుగోలు చేసే ఉద్దేశంలో ఉన్నామని ప్రకటించింది. ఉద్యోగుల్లో నిరసనలు తగ్గించడానికి కేంద్రం ఆసంస్థతో ఇలా ప్రకటన చేయించిందని ఉద్యోగులు నమ్ముతూ అదే విధమైన ప్రకటనలు చేస్తున్నారు. టాటా సంస్థలకు ప్రజల్లో ప్రత్యమైన అభిమానం ఉంది. కోవిడ్ సమయంలో కానీ.. ఇతర సందర్భాల్లో కానీ టాటా సంస్థలు లాభాపేక్ష కన్నా ఎక్కువగా సమాజ సేవ కోసం వ్యాపారం చేస్తూంటాయి. ఆ సంస్థ ఓనర్లు ఎవరూ ఫోర్బ్స్ జాబితాలో ఉండరు. ఆ సంస్థ ఆదాయం అంతా ట్రస్టులకే పోతుంది. కరోనా సమయంలోనూ రతన్ టాటా సేవా కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి
ఈ క్రమంలో టాటా సంస్థలపై ఉన్న పాజిటివిటీని ఉక్కు ఉద్యమాన్ని నీరు గార్చేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా వాడుకుంటోందన్న అభిప్రాయంలో ఉద్యమకారులు ఉన్నారు. టాటా స్టీల్ ఇప్పుడు భారీ లాభాల్లో ఉంది. విదేశాల్లోనూ టాటా స్టీల్‌కు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఎగుమతులు కూడా ఎక్కువే. వ్యూహాత్మకంగా ఆ సంస్థ టాటా స్టీల్‌ను చేజిక్కించుకుంటే మరిన్ని అవకాశాలు పొందుతుంది. కానీ ఇంత కాలం సైలెంట్‌గా ఉండి ఇప్పుడు మాత్రమే టాటా ఎందుకు తెరపైకి వచ్చిందనేది ఉద్యోగుల అనుమానం. కారణం ఏదైనా టాటా సంస్థ ప్లాంట్‌ను కొనుగోలు చేస్తుందంటే.. ఉద్యమ తీవ్రత మరింత తగ్గడం ఖాయమని భావిస్తున్నారు.