ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాల పథకాలపై షార్ట్ ఫిల్మ్ పోటీలు పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రకటన చేసింది. మెచ్చిన వాటికి ఎంత బహుమతి ఇస్తారో చెప్పలేదు కానీ… అసలు నవరత్నాల పథకాల అమలు గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పనిస్తారా అన్న సందేహం మాత్రం చాలా మందికి ఉంది. నవరత్నాల పథకాల్లో అమలు చేస్తున్నవి కొన్నే.. కానీ అమలు చేస్తున్నట్లుగా భారీ ప్రచారం చేసుకునేవి ఎన్నో. ముఖ్యంగా మద్య నిషేధం కూడా నవరత్నాల్లో ఒకటి. మద్యనిషేధం అనే మాట ఎక్కడా లేకపోగా ఇప్పుడు.. వచ్చే పదిహేనేళ్ల కాలానికి వచ్చే మద్యం ఆదాయాన్ని బ్యాంకులో కుదువపెట్టి ఇప్పటికే పాతికవేల కోట్ల రుణం తీసుకున్నారు. మనేనిఫెస్టో హామీ ప్రకారం మళ్లీ ఎన్నికల నాటికి స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అమ్మాలి. కానీ ఏపీలో నిఖార్సైన స్టార్ హోటళ్లు నాలుగైదు కూడా ఉండవు.
ఇక రైతు భరోసా పథకంలో రాష్ట్రం తాము ఇస్తామన్న రూ. 12500లోరూ. 7500 మాత్రమే ఇస్తోంది. మిగతాది కేంద్రం ఇస్తోంది కదా.. అని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇక నవరత్నాల్లో అత్యంత కీలకమైన మరో పథకం పెన్షన్లు. ప్రతి ఏడాది రూ. 250 చొప్పున పెంచుకుంటూ పోతామని చేసిన ప్రకటన అమలు కాలేదు. మూడో ఏడాదిలో అడుగుపెట్టినా .. గత ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే రూ. 250 మాత్రమే ఎక్కువిస్తున్నారు. ఇక పేదలందరికీ ఇళ్లు పేరుతో చేసిన హడావుడిలో రెండున్నరేళ్లలో కేవలం ఐదు ఇళ్లు మాత్రమే కట్టారని కేంద్రం చెప్పింది. సెంటు స్థలాలిచ్చి అందులో కట్టుకోవాలని లబ్దిదారులపై ఒత్తిడి చేస్తున్నారు. నిరుపేదలు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు.
జల యజ్ఞం, అమ్మఒడి, కాపు నేస్తం సహా అనేక పథకాల లబ్దిదారులు ఏటికేడు తగ్గిపోతున్నారు. అర్హుల పేరుతో పదిహేను వరకూ పారామీటర్స్ పెట్టి అందర్నీ ఎలిమినేట్ చేసి.. ఓ పది శాతం మందికి ఇచ్చి అదే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. నవరత్నాలు అంటే ఇప్పటి వరకూ నిఖార్సుగా అదే. షార్ట్ ఫిల్మ్ మేకర్లు నిజాయితీ ఆ విషయాలను చెబితే పరిగణనలోకి తీసుకోవడం కష్టమే. అందుకే అబద్దాలు చెప్పేలా షార్ట్ ఫిల్మ్స్ ఉంటేనే అవార్డులిస్తారని.. వాటికి అదే ప్రధాన అర్హతగా అప్రకటితంగా ఉంటుందని ఔత్సాహిక ఫిల్మ్ మేకర్లు సెటైర్లు వేసుకునే పరిస్థితి.