ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సివిల్ సర్వీస్ అధికారులపై హైకోర్టు మండి పడుతున్నా అదే పనిగా హైకోర్టుకు అబద్దాలు చెబుతున్నారు కానీ ఉపాధి హామీ బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. ఈ బిల్లులు చెల్లించని వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలానికి కాదు. టీడీపీ హయాంలో చివరి ఏడాదికి.2018-19 సమయంలో ఉపాధి పనులు చేసిన వారందరూ టీడీపీ నేతలేనని వారికి డబ్బులివ్వడం దండగ అని ప్రభుత్వం అనుకుంటోంది. నిజానికి ఈ పనులకు నిధులు ఇచ్చేది కేంద్రం. కేంద్రం ఇచ్చింది. రాష్ట్రం తీసుకుంది. కానీ పనులు చేసిన వారికి చెల్లించలేదు. ఇక్కడే సమస్య వచ్చింది.
2018-19 సంవత్సరానికి గాను అధికారిక లెక్కల ప్రకారం 7 లక్షల పైచిలుకు పనుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. చేసిన పనులకు అధికారులు కొలతలు తీసి.. బిల్లులు కూడా సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో చెల్లింపులు నిలిపివేసింది. విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో బిల్లులు నిలిపివేశారు. అనేక మంది కోర్టులకు వెళ్లడంతో వారికి డబ్బులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. చెల్లించామని ఓ సారి..కేంద్రం ఇవ్వలేదని మరోసారి చెబుతూ హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించారు. చివరికి ఐఏఎస్ అధికారులు హైకోర్టు ఎదుట హాజరు కావాల్సి వచ్చింది
కేంద్ర ప్రభుత్వం తామివ్వాల్సిన నిధులన్నీ ఇచ్చేశామని హైకోర్టుకు తెలిపింది. కేంద్రం మొత్తం నిధులు ఇచ్చినా చెల్లింపులు చేయలేదంటే ఇతర పథకాలకు మళ్లించారా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఉపాధి హామీ పనుల కాంట్రాక్టులు ఆయా పార్టీల సానుభూతి పరులకే వస్తాయి. తమ పార్టీ కోసం కష్టపడిన వారికి ఆర్థికంగా లబ్ది చేకూర్చడానికి గ్రామ స్థాయి నేతలకు ఈ పనులను ప్రభుత్వాలు ఇస్తాయి. ఈ కారణంగా టీడీపీ నేతలు అప్పట్లో పనులు పొందారు. వారే పనులు చేశారు . అందుకే వారికి డబ్బులు ఎగ్గొట్టినా పర్వాలేదని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉంది.
పనులు చేసిన వాళ్లు టీడీపీ నేతలా.. వైసీపీ నేతలా అన్నది కాదు.. న్యాయబద్ధంగా తమ సొంత డబ్బులు పెట్టి పనులు చేసి ఉంటే చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ఇలా వారు చేసిన పనులకు కేంద్రం ఇచ్చి నిధులను స్వాహా చేసి కోర్టులను సైతం లెక్క చేయకపోతే ప్రభుత్వంపై విశ్వాసం పోతుంది. గత ప్రభుత్వం పోలవరానికి ఖర్చు పెట్టిన నిధులు దాదాపుగా రూ. ఐదు వేల కోట్లు రీఎంబర్స్గా ఈ ప్రభుత్వానికి వచ్చాయి. కానీ ఐ ఐదు వేలకోట్లను పోలవరానికి ఖర్చు పెట్టకుండా మళ్లించారన్న విమర్శలు ఉన్నాయి.