కష్టాలు చెప్పుకుందామని ఫోన్లు చేస్తూంటే అటు చంద్రబాబు కానీ ఇటు లోకేష్ కానీ ఫోన్లు ఎత్తడం లేదన్న తీవ్ర అసంతృప్తితో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 25వ తేదీన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన తనుకు సన్నిహితులైన మీడియా ప్రతినిధులుక తెలిపారు. అయితే బుధవారం రాత్రి చంద్రబాబునాయుడు గోరంట్లకు ఫోన్ చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజమండ్రిలోని టీడీపీ అంతర్గత రాజకీయాల్లో చంద్రబాబు తనకు సపోర్ట్ చేయలేదన్న కారణంగానే ఆయన అసంతృప్తికి గురయ్యారని అంటున్నారు.
రాజమండ్రి టీడీపీలో వర్గాలకు కొదవ లేదు. గోరంట్లతో పాటు సిటీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. ఆమె ఆదిరెడ్డి అప్పారావు కోడలు. దివంగత టీడీపీ నేత ఎర్రంనాయుడు కుమార్తె. ఆ కుటుంబం తన రాజమండ్రి రూరల్ నియోజవకర్గంలోనూ వేలు పెడుతోందని తన వద్దకు నేతల్ని రానీయడం లేదని. .ఎవరైనా వస్తే వారిని దూషిస్తున్నారని గోరంట్ల అసంతృప్తితో ఉన్నారు. వారిని కంట్రోల్ చేయాలని హైకమాండ్‌ను కోరినా పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా ఆయన పార్టీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత. పార్టీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు. ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వయసు కారణంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బంది అయితే.. తన రాజకీయ వారసుడుపోటీ చేస్తారని.. తన దివంగత సోదరుడు శాంతారామ్ కుమారుడు, రవిరామ్ కిరణ్ ను రాజకీయ వారసుడిగా ప్రకటించారు. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. అయినప్పటికీ తనను లెక్క చేయడం లేదన్న అసంతృప్తితో చివరికి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.