తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కాస్త కదలిక తీసుకు వచ్చిన పీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి మరింత జోష్ నింపేందుకు హైకమాండ్‌ను కూడా రంగంలోకి దించాలని అనుకుంటున్నారు. దళిత, గిరిజన దండోరా సభను ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహిస్తున్న రేవంత్ వచ్చే నెల 17వ తేదీన వరంగల్‌లో సభను ఖరారు చేశారు. ఆ సభకు రాహుల్ గాంధీ వచ్చేలా ఒప్పించారు. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ కూడా ధృవీకరించారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తారని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హడావుడి ప్రారంభమయింది.
హైకమాండ్ నుంచి ఈ సభను ఓ బలప్రదర్శన వేదికగా రేవంత్ రెడ్డి వినియోగించుకునే అవకాశం ఉంది. అదే సమయంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉండే ఆదరణను మరింతగా పెంచుకునేందుకు రేవంత్ వ్యూహం పన్నే అవకాశం ఉంది. ఉపఎన్నికలు ఎంత వాయిదా పడితే కేసీఆర్‌కు దళిత వర్గాల నుంచి అంతగా ఒత్తిడి వస్తుందనే రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. వచ్చే నెల పదిహేడో తేదీ లోపు హుజూరాబాద్‌లో పూర్తి స్థాయిలో పథకం అమలు చేయకపోతే.. ఈ అంశాన్ని కూడా రాహుల్ గాంధీ సభలో ప్రత్యేకంగా హైలెట్ చేసి.. కేసీఆర్ మోసం చేశారని ప్రకటించాలని భావిస్తున్నారు.
కొంత మంది కాంగ్రెస్ సీనియర్లు సహకరించకపోయినా రేవంత్ రెడ్డి కలసి వచ్చే వారితో పోరాటం చేస్తున్నారు. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ఇంకా రేవంత్ తో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. రాహుల్ గాంధీ వరంగల్ దళిత, గిరిజన దందోరాకు హాజరైతే.. వారంతా ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అదే జరిగితే… వారిపై రేవంత్ రెడ్డి పై చేయి సాధించినట్లవుతుంది. రాహుల్ గాంధీ సభతో అటు రాజకీయంగా బలపడటం.. ఇటు పార్టీలోనూ మరింత పట్టు పెంచుకోవడం రేవంత్ రెడ్డికి సులువు అవుతుంది.