పరిటాల రవి చిన్నకుమారుడు పరిటాల సిద్ధార్థ్ బ్యాగ్‌లో బుల్లెట్ దొరికిన వ్యవహారం అంతకంతకూ పెద్దది అయి సాయుధ బలగాల వద్దకు చేరుతోంది. మూడు రోజుల కిందట శ్రీనగర్ వెళ్లేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు బ్యాగుతో వచ్చారు పరిటాల సిద్ధార్థ్. అక్కడ తనిఖీల్లో సెన్సార్లు బుల్లెట్‌ను గుర్తించాయి. తనకు లైసెన్స్ గల తుపాకీ ఉందని దాని కోసం కొనుగోలు చేసిందని చెప్పారు. బ్యాగులో బుల్లెట్ ఉందని తెలియక తెచ్చానని చెప్పారు. అప్పటికి హామీ పత్రం ఇచ్చి వెళ్లిపోయారు. అయితే ఆ బుల్లెట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు పరిశీలన జరిపితే.. అది సాయుధ బలగాలు వాడే బుల్లెట్‌గా గుర్తించారు. పరిటాల సిద్దార్థ్‌కు పాయింట్ 32 క్యాలిబర్ గన్‌కు లైసెన్స్ ఉంది.
కానీ బ్యాగ్‌లో దొరికింది మాత్రం 5.56 క్యాలిబర్ బుల్లెట్. వీటిని ఐటీబీపీలో పని చేసే జవాన్లు ఉపయోగిస్తూంటారు. ఈ బుల్లెట్ అంశంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. పరిటాల కుటుంబానికి సన్నిహితుడైన జవాన్ ఒకరు ఇచ్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతుననాయి. అస్సాంలో ఐటీబీపీ జవాన్‌గా పని చేసే అనంతపురం జిల్లా ములకనూరుకు చెందిన ఓ కానిస్టేబుల్ కూడా ఏప్రిల్ 17న అనంతపురంకు తిరిగి వచ్చే సమయంలో అక్కడ ఎయిర్‌పోర్టులో వంద బుల్లెట్లు తెస్తూ దొరికిపోయారు.
దీనిపై ఐటీబీపీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి బుల్లెటే సిద్ధార్థ్ వద్ద దొరకడంతో ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో తీగ లాగుతున్నట్లుగా తెలుస్తోంది. పరిటాల సిద్ధార్థ్ ఇప్పటి వరకూ ఎక్కడా వివాదాస్పద అంశాల్లో తెరపైకి రాలేదు. తొలి సారి బుల్లెట్‌తో దొరికిపోవడంతో కలకలం రేపుతోంది. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ఈ బుల్లెట్‌పై విపరీత ప్రచారం చేస్తున్నారు.