తెలంగాణ సీఎం కేసీఆర్ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఒక్కోసారి ఆయనకు తెలియకుండానే కేసీఆర్ గొప్పతనాన్ని ఆయన అంగీకరిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. యువజన కాంగ్రెస్ నేతల్ని ప్రభుత్వంపై పోరాటం దిశగా ఆయన ఇటీవల కాలంలో బాగా యాక్టివేట్ చేస్తున్నారు. వారిలో ఎన్నికల్లో పోటీ చేసే ఆశ నింపితే మరింతగా దూకుడు చూపిస్తారని అనుకున్నారు. వారితో ఓ కన్వెన్షన్ సెంటర్లో సమావేశం పెట్టారు. ఈ సందర్భంగా తాము పదవుల్లో ఉన్నాం కాబట్టి టిక్కెట్ ఇవ్వాలంటే కుదరదని.. కష్టపడి పని చేయాల్సిందేనని చెప్పారు.
యూత్ కాంగ్రెస్లో ఉన్నారు..కుర్రాళ్లు అని టిక్కెట్ ఇవ్వరని అనుకోవద్దని.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేతలంతా యూత్ కాంగ్రెస్ నుంచే ఎదిగారని పేర్లు కూడా చెప్పారు. అలా చెప్పిన చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే కాదు.. కేసీఆర్ పేరు కూడా ఉంది. వీరు ముగ్గురూ కాంగ్రెస్ పార్టీ నాయకులే. యూత్ కాంగ్రెస్లో పని చేశారు. పదవులు కూడా చేపట్టారు. కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు కూడా. దీన్నే రేవంత్ రెడ్డి ప్రస్తుత యూత్ కాంగ్రెస్ నేతలకు చెప్పి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. వారెవరూ ఆషామాషీగా ఎదుగలేదని ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చారన్నారు. కష్టపడటమే ఎదగడానికి బలమైన ప్రాతిపదిక అని తేల్చారు. పార్టీ కోసం కష్టపడితే ఇంటికొచ్చి బీఫాం ఇస్తామని ప్రకటించారు.
ఏ పార్టీలో అయినా సంక్షోభ సమయంలోనే నాయకులు తయారవుతారని, ఆ స్థితిలో కాంగ్రెస్లో ఉందని, అవకాశాన్ని వినియోగించుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులకు సూచించారు. కాంగ్రెస్కు ఓనర్లు ఎవరూ లేరని, ఎవరు కష్టపడి పనిచేస్తే వారే నాయకులని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ ప్రసంగం యూత్ కాంగ్రెస్ నేతలకు కిక్ ఇచ్చింది కానీ వారికి ఊపు తెప్పించడానికి కేసీఆర్ను కూడా ఆదర్శింగా తీసుకోవాలని చెప్పడమే చాలా మందిని ఆశ్చర్య పరిచింది.