అమరావతి పిటిషన్లపై విచారణ నవంబర్ 15కు వాయిదా పడింది. కరోనా కారణం చెప్పి పిటిషనర్లు వాయిదా కోరితే.. మీరే నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ లాయర్లు హైకోర్టు ఇష్టమని.. దేశంలోని పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని చాయిస్ ఇచ్చేశారు. దీంతో హైకోర్టు ధర్మాసనం నవంబర్ 15వ తేదీకి విచారణ వాయిదా వేసింది. పిటిషనర్లు వాయిదా కోరడం పెద్ద ఆశ్చర్యకరం కాదు కానీ వాదనలు వినిపించడానికి ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపించకపోవడమే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు రాజధాని పిటిషన్లపై విచారణ చేపట్టాలని ముందుగా హైకోర్టులో పిటిషన్ వేసింది ప్రభుత్వమే. గత మార్చిలో ఏజీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో హైకోర్టు అంగీకరించింది.
సీజే ఏకే గోస్వామి నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం కూడా ఏర్పాటయింది. అయితే రోజువారీ విచారణ ప్రారంభిస్తారనుకున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగస్టుకు వాయిదా పడింది. ఇప్పుడు అన్ని కోర్టు కార్యకలాపాలు యధావిధిగా సాగుతున్నాయి. వర్చువల్ హియరింగ్స్ జరుగుతున్నాయి. అందరూ వాటికి అలవాటు పడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో అమరావతి విచారణకు పట్టుబట్టి వీలైనంత త్వరగా పరిష్కరించేంసుకుని మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
అటు పిటిషనర్లు, ఇటు ప్రభుత్వం రెండు పక్షాలూ రాజధాని వ్యాజ్యాలపై విచారణ జాప్యం కోసం సిద్ధమవడంతో ఇక మూడు రాజధానుల అంశం మరింత కాలం పెండింగ్లో పడే అవకాశం కనిపిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మూడు రాజధానుల ప్రస్తావన లేకుండానే సీఎం ప్రసంగం ముగిసింది. ఇప్పుడు విచారణ కూడా అంత అర్జంటేమీ లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రభుత్వానికి మూడు రాజధానులపై ఆసక్తి తగ్గిపోయిందన్న అభిప్రాయం బలపడటానికి కారణం అవుతోంది.