చిరు పుట్టిన రోజు వేడుకలు అయిపోయాయి. రోజుంతా చిరు సినిమాలదే సందడి. గాడ్ ఫాదర్, భోళా శంకర్ లుక్స్, బాబి సినిమా లుక్స్ తో.. సంబరాలు రెట్టింపు అయ్యాయి. అంతా బాగానే ఉన్నా – ఎక్కడో మెహర్ రమేష్ ప్రాజెక్ట్ నే కాస్త అనుమానంగానూ, ఆశ్చర్యంగానూ చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. అసలు ఈ కాంబినేషన్ సెట్ కావడంలోనే బోల్డంత ఫజిల్ ఉంది. ఉందుకంటే… శక్తి, షాడో… సినిమాలు చూశాక మెహర్ రమేష్ పేరెత్తడానికే భయపడిపోయారు హీరోలు, నిర్మాతలు. మెహర్ కూడా ఎవరినీ కలిసి, కథ చెప్పే ధైర్యం చేయలేదు. అలాంటి మెహర్ కి ఈ ప్రాజెక్టు దక్కడం షాకింగ్ ఎలిమెంటే.
మెహర్ ఏదో అద్భుతమైన కథ చెప్పి, చిరుని కదిలించడానికి చెప్పడానికేం లేదు. ఎందుకంటే ఇది వేదాళం రీమేక్. ఓ భాషలో బాగా ఆడిన సినిమాని రీమేక్ చేయడం చిరుకి కొత్త కాదు. కానీ అలా రీమేక్ చేసినప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. హిట్స్ తో స్పీడుమీదున్న డైరెక్టర్ కే ఆ బాధ్యత అప్పగిస్తాడు. మార్పులు చేర్పుల విషయంలో చిరు హ్యాండ్ చాలా ఉంటుంది. దగ్గరుండి తనకు అనువుగా ఈ కథని మలచుకుంటాడు. కానీ `వేదాళం` రీమేక్ విషయంలో ఇదేం జరగలేదు.
నిజానికి వేదాళం రీమేక్ చేయాలన్న ఆలోచన చిరుది కాదు. కేవలం మెహర్ రమేష్ దే. ఈ సినిమా చూసి, దాన్నితెలుగు నేటివిటీకి అనువుగా మార్చుకుని ఓ స్క్రిప్టు తయారు చేశాడట మెహర్. తాను కథ రాస్తున్నప్పుడు హీరో చిరంజీవి కాదు. మరెవరో. ఆమధ్య సీసీసీ అంటూ చిరు ఓ కార్యక్రమం మొదలెట్టినప్పుడు… వెనుక ఉండి, ఆ పనులు చూసుకున్నది మెహర్ రమేషే. ఆ సందర్భంగా.. చిరుతో సాన్నిహిత్యం పెరిగింది. ఆ సమయంలోనే `నీ దగ్గర కథలేమైనా ఉన్నాయా` అని అడిగితే.. వేదాళం రీమేక్ గురించి చెప్పడం, చిరుకి ప్రత్యేకంగా ఆ సినిమా చూపించి, తాను ఎలాంటి మార్పులు చేశాడో పూస గూచ్చినట్టు చెప్పడంతో చిరు బాగా ఇన్స్పైర్ అయ్యాడని తెలుస్తోంది. అప్పటికీ.. చిరు ఈ సినిమా చేస్తాడన్న నమ్మకం మెహర్ కి లేదు. ఓరోజు `ఈ కథ నేనే చేస్తా` అని చిరు మాట ఇవ్వడం – ఏకే ఎంటర్టైన్మెంట్స్ ని ఈ టీమ్ లోకి తీసుకురావడం ఇవన్నీ చిరునే చూసుకున్నాడట. అలా.. మెహర్ కి అనుకోని అదృష్టం వరించేసింది. నిజానికి ఇంత జరుగుతున్నా ఈ ప్రాజెక్టుపై ఎవరికీ నమ్మకాల్లేవు. మొదలైప్పుడు చూద్దాంలే అనుకున్నారు. ఇప్పుడు టైటిల్, ఫస్ట్ లుక్ కూడా వచ్చేశాయి కాబట్టి.. నమ్మక తప్పడం లేదు. మరి చిరు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మెహర్ ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలి.