కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తులన్నింటినీ అమ్మకానికి పెడుతున్నట్లుగా ప్రకటించారు. అందులో రోడ్డు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు ఇలా ప్రతీ ఒక్కటీ ఉన్నాయి. మొత్తంగా రూ. ఆరు లక్షల కోట్లను టార్గెట్‌గా పెట్టుకుని అమ్మకాలు ప్రారంభిస్తామని ఆమె చెప్పుకొచ్చారు. కేంద్రానికి ప్రత్యేకంగా ఆస్తులు ఎక్కడో ఉండవు. రాష్ట్రాల్లోనే ఉంటాయి. ఆ రాష్ట్రాల్లో ఆ ఆస్తులను పెంచి అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను ఎంత వరకు మెరుగు పరిచారో తెలియదు కానీ ఇప్పుడు వాటిని మాత్రం అడ్డంగా అమ్మేయడానికి సిద్ధపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్లు వచ్చే ఆస్తులు ఏమీ లేవు. కానీ వాటినీ అమ్మేయాలనుకుంటున్నారు.
విజయవాడ, తిరుపతి,రాజమండ్రి విమానాశ్రయాలను అమ్మకాల జాబితాలో చేర్చింది కేంద్రం. రూ. 990 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశాక ఎయిర్‌పోర్టు జోలికి మాత్రం రాలేదు. దానికి కారణం ఆ ఎయిర్‌పోర్టు భద్రతా బలగాల అధీనంలో ఉంటుంది. కమర్షియల్ ఫ్లైట్స్‌కు అనుమతి ఇచ్చినా అది దేశభద్రతా పరంగా వ్యూహాత్మక ఎయిర్‌పోర్టు. అందుకే విశాకను మాత్రం వదిలేశారు. అది కాకుంజా ఏపీలో ఉన్న చెప్పుకోదగ్గర ఎయిర్‌పోర్టులన్నీ అమ్మేస్తున్నారు. ఎయిర్‌పోర్టులే అమ్మేస్తే ఇక రైల్వే స్టేషన్లు వదిలేస్తారా.. మొదటిదశలో తిరుపతి. నెల్లూరు రైల్వేస్టేషన్లకు టెండర్లు పిలుస్తారు. చిలుకలూరిపేట – విజయవాడ రోడ్డును కూడా అమ్మేస్తారట. ఇక విశాఖ పట్నం పోర్టులో కూడా నాలుగు ప్రాజెక్టుల్ని అమ్మేసే జాబితాలో చేర్చారు.
రైల్వే, రోడ్లు, విద్యుత్ రంగాల్లోని ప్రభుత్వ ఆస్తులను అమ్మడానికి మానిటైజ్ అని పేరు పెట్టారు. అయితే అమ్మకాలు కాదని.. యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయనినిర్మలా సీతారామన్ చెబుతున్నారు. అంటే యాభై ఏళ్లకు.. 99 ఏళ్లకు లీజుకు ఇస్తారన్నమాట. అలా తరాలకు తరాలు లీజులకు ఇవ్వడం..అమ్మడానికి పెద్ద తేడా లేదు. కానీ అమ్మితే ప్రజా వ్యతిరేకత వస్తుందన్న భయంతో మానిటైజ్ అనే పేరుతో తెర ముందుకు వస్తున్నారని నిపుణులు అంటున్నారు.