కేజీఎఫ్ తో దుమ్ము దులిపాడు కన్నడ హీరో యష్. ఇప్పుడు తాను ఓ పాన్ ఇండియా స్టార్. తన కోసం టాలీవుడ్ లోనూ కథలు రెడీ అవుతున్నాయి. బోయపాటి శ్రీను.. యష్ కోసం ఓ కథ అనుకుంటున్నాడట. `అఖండ` తరవాత.. బోయపాటి – యష్‌ల మధ్య సిట్టింగులు జరగబోతున్నాయని టాక్. అయితే యష్ కోసం బోయపాటి కొత్త కథేం రాయలేదు. ఇప్పటికే తన దగ్గరున్న కథని యష్ కోసం మార్చబోతున్నాడు.
బోయపాటి – చరణ్‌ల కాంబినేషన్ లో వినయ విధేయ రామ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అది ఫ్లాప్ అయ్యింది. నిజానికి.. దానికంటే ముందు చరణ్ కి ఓ కథ వినిపించాడు బోయపాటి శ్రీను. అది బాగానే ఉన్నా – కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయని భావించిన చరణ్.. `వినయ విధేయ రామా`కి ఓటేశాడు. అయితే చరణ్ అంచనా తప్పింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. వినయ విధేయ రామా ఫ్లాప్ అయినా సరే.. `మీరు ముందు చెప్పిన కథ బాగుంది. దాన్ని ఎప్పటికైనా చేద్దాం` అంటుంటేవాడట. అయితే చరణ్ కి ఉన్న బిజీ షెడ్యూల్స్‌లో.. బోయపాటితో మళ్లీ చేసే ఛాన్స్ రావాలంటే చాలాకాలం ఎదురు చూడాలి. అందుకే బోయపాటి ఈ కథని యష్ కి అనుగుణంగా మార్చుకున్నాడని టాక్. యష్ కి కూడా తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఉంది. పూరి జగన్నాథ్ – యష్‌ల కాంబో దాదాపు సెట్ అయ్యేదే. కానీ ఆగిపోయింది. మరి బోయపాటితో ఏం అవుతుందో చూడాలి.